బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురు వర్షపాతం నమోదైంది. నేడు, రేపు విస్తారంగా వర్షాలు పడొచ్చని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.
తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో దంచి కొట్టాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. జనం అంధకారంలో గడిపారు. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది.

కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, కోయంబత్తూరు.. వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాలను ఈదురుగాలులు వణికించాయి.
నేడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను సైతం జారీ చేసింది. భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షం ప్రభావం వల్ల పగటి ఉష్ణోగ్రత తగ్గుతుందని, రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుదల ఉండొచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications