బెంగళూరుకు బిగ్ బూస్ట్: సీఎం డీకే శివకుమార్ గుడ్ న్యూస్
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భారీ ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గృహ విద్యుత్ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్‌తో సేవలు పొందుతున్న పాత భవనాలకు శాశ్వత విద్యుత్ లైన్లు పొందేందుకు 15 రోజుల పాటు ఒకేసారి ప్రత్యేక గడువు విధిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రజోపయోగకర నిర్ణయాలను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం మే 31, 2000వ సంవత్సరానికి ముందే నిర్మాణం పూర్తయి, ప్రస్తుతం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్న పాత గృహ సముదాయాలకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. కటాఫ్ తేదీ తర్వాత నిర్మాణం పూర్తయిన భవనాలకు ఈ మినహాయింపు వర్తించదు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ను శాశ్వతంగా మార్చుకోవడానికి ప్రత్యేకంగా 15 రోజుల విండో విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. దరఖాస్తుదారుడు తన ఫోటో, సంబంధిత భవనం ఫోటో, జీపీఎస్ లొకేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన అంశం ఇది. ప్రస్తుతం బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2000, మే 31 నాటికి నిర్మాణం పూర్తయిన వాటి విద్యుత్ కనెక్షన్లన్నింటినీ కూడా ప్రభుత్వం క్రమబద్దీకరించనుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ మరింత పుంజుకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కోసం పట్టు పురుగుల పెంపక కేంద్రాలు, పశువుల పాకలు, పాడి పరిశ్రమ షెడ్లకు ఈ నిబంధనల నుంచి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ కర్ణాటక మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రూ. 235.60 కోట్ల వ్యయంతో కేఎస్ఆర్‌టీసీ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థల కోసం 620 నూతన బీఎస్-4 ప్రమాణాలు కలిగిన బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మూడు రవాణా కార్పొరేషన్ల పరిధిలో, 10 నగరాల్లోని 11 ప్రాంతాలలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ చార్జింగ్ డిపోల ఏర్పాటుకు రూ. 112.72 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించింది. యాద్గిర్ లో 200 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ సూపర్ స్పెషాలిటీ కేర్ సెంటర్ ఆ ప్రాంత పేద రోగులకు మెరుగైన ఉచిత వైద్య సహాయాన్ని అందించనుంది.
బెంగళూరు పరిసర ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధికి వీలుగా దేవనహళ్లి తాలూకాలోని 13 గ్రామాలలో సాగుతున్న భూసేకరణ ప్రక్రియ గడువును 2026 అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖలలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ వివాదాలను వేగంగా పరిష్కరించడానికి, న్యాయపరమైన సలహాలు అందించడానికి వీలుగా రిటైర్డ్ న్యాయాధికారుల సేవలను వినియోగించుకోనున్నారు.












Click it and Unblock the Notifications