హోటళ్లు కాదు, చావుకు మార్గాలు! ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. కంగుతిన్న అధికారులు
విలాసవంతమైన భవనాలు, కళ్లు చెదిరే విద్యుత్ కాంతులు, వేలల్లో బిల్లులు వసూలు చేసే ఫైవ్‌స్టార్ హోటళ్లు అనగానే అందరికీ శుభ్రత, నాణ్యమైన ఆహారమే గుర్తుకొస్తుంది. కానీ, ఆ మెరుపుల వెనుక ఎంతటి ఘోరం దాగి ఉందో బెంగళూరులో జరిగిన తాజా తనిఖీల్లో వెలుగుచూసింది. లగ్జరీ హోటళ్ల కిచెన్లలో అడుగుపెట్టిన ఆహార భద్రత అధికారులకే అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి మైండ్ బ్లాంక్ అయింది. రంగుల వెనుక దాగి ఉన్న కుళ్ళిన కూరగాయలు, బూజు పట్టిన పదార్థాల నిజాలు బయటపడటంతో ఆహార ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
30 టీమ్‌లు... 26 లగ్జరీ హోటళ్లు
బెంగళూరు నగర పరిధిలోని త్రీ-స్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సడన్ సర్ప్రైజ్ రైడ్స్ నిర్వహించింది. ఏకంగా 30 బృందాలుగా ఏర్పడిన అధికారులు శుక్రవారం ఒక్కరోజే నగర వ్యాప్తంగా ఉన్న 26 ప్రముఖ హోటళ్ల వంటశాలలను, స్టోర్ రూమ్‌లను జల్లెడ పట్టారు. కిచెన్లలోకి వెళ్లి చూస్తే కనీస శుభ్రత లేకపోవడమే కాకుండా, ఎప్పుడో కాలం చెల్లిన డెయిరీ ఉత్పత్తులు, పాడైపోయిన నాన్‌వెజ్ నిల్వలను వినియోగిస్తున్నట్లు తేలింది.

బూజు పట్టిన కూరగాయలు... పక్కపక్కనే వెజ్, నాన్‌వెజ్
తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు అధికారులను సైతం షాక్‌కు గురిచేశాయి. ఫ్రిజ్‌లలో ఉంచిన కూరగాయలకు బూజు పట్టడం, ఎప్పుడో ఎక్స్‌పైరీ అయిపోయిన పాలు, బేకరీ ఉత్పత్తులతోనే పదార్థాలు తయారు చేస్తున్నట్లు దొరికిపోయింది. ఇక కొన్ని హోటళ్లలో శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా ఉంచకుండా ఒకే చోట కోల్డ్ స్టోరేజ్ చేయడం గమనార్హం. అధికారులు ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకున్న కొందరు కిచెన్ స్టాఫ్.. క్షమాపణలు చెబుతూ బేకరీ ఐటమ్స్‌ను చెత్తబుట్టలో పారబోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏ హోటల్లో ఎంతెంత పదార్థాలు స్వాధీనం?
తనిఖీల్లో భాగంగా అధికారులు భారీగా కుళ్ళిపోయిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని అక్కడిక్కడే ధ్వంసం చేశారు.
- ది లలిత్ అశోక్: ఇక్కడ ఏకంగా 76 కేజీల మాంసం, 200 కేజీల పాడైపోయిన కూరగాయలతో పాటు 32 లీటర్ల ఎక్స్‌పైర్డ్ పాలను అధికారులు సీజ్ చేశారు.
- రేడిసన్ బ్లూ (ది అత్రియా): ఈ హోటల్లో అత్యధికంగా 105 కేజీల నిల్వ ఉంచిన తినుబండారాలు లభించాయి. ఇందులో 50 కేజీల చికెన్, 23 కేజీల మటన్, 7 కేజీల చేపలు ఉన్నాయి.
- తాజ్ యశ్వంతపూర్: ఇక్కడ నాణ్యత లేని 72 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- షాంగ్రిలా & ఫోర్ సీజన్స్: షాంగ్రిలాలో 15 కేజీలు, ఫోర్ సీజన్స్ హోటల్లో 19 కేజీల చొప్పున నిల్వ ఉంచిన నాన్‌వెజ్ మెటీరియల్‌ను సీజ్ చేశారు.
- వివాంటా వైట్‌ఫీల్డ్: ఇక్కడ కాలం చెల్లిన బేకరీ పదార్థాలను గుర్తించారు.
కోర్టు, కఠిన చర్యలకు రెడీ
హోటళ్ల నుంచి చికెన్, మటన్, చేపలు, పాలు, నెయ్యి, కారం, పసుపు, సాస్, కాజూతో సహా మొత్తం 35 రకాల శాంపిళ్లను అధికారులు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రసిద్ధ హోటళ్లన్నింటికీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ నివేదికలు రాగానే చట్టప్రకారం సదరు యాజమాన్యాలపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత శాఖ స్పష్టం చేసింది. బ్రాండ్ చూసి వేలకు వేలు తగలేస్తున్న సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.




Click it and Unblock the Notifications