క్లౌడ్ బరస్ట్- బెంబేలెత్తుతున్న బెంగళూరు: మళ్లీ భారీ వర్షం
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాల వల్ల సగం నీట మునిగిందీ సిలికాన్ సిటీ. ఇప్పుడు తాజాగా దానా తుఫాన్ ప్రభావంతో మరోసారి కుంభవృష్టి సంభవించే అవకాశం లేకపోలేదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దీనికి అనుగుణంగా బెంగళూరులో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ప్రత్యేకించి- బెంగళూరు దక్షిణ ప్రాంతంలో అనేక కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్లల్లో వరద నీరు పోటెత్తింది. ఈ ఉదయం వర్షం పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు గానీ అది ఎంతో సేపు నిలవలేదు. మధ్యాహ్నానికి మళ్లీ దట్టంగా మేఘాలు అలముకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది.

సోమవారం సాయంత్రం బెంగళూరులో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన అతి భారీ వర్షం తెల్లవారేంత వరకూ కురిసింది. దీని దెబ్బకు బెంగళూరు దక్షిణ ప్రాంతంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరదనీరు ప్రవహించింది. అనేక నివాసాలు నీట మునిగాయి.
యలహంకలోని కేంద్రీయ సదన్‌లో మళ్లీ మునిగింది. సెల్లార్ సహా ఆవరణలో నిలిపివుంచిన వాహనాలు సగం వరకు మునిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నివసిస్తోన్న వారిని కాపాడటానికి రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. పడవల సహకారంతో వారిని బయటికి తీసుకొచ్చారు. వయోధిక వృద్ధులను భుజాలపై ఎత్తుకుని తీసుకుని రావడం కనిపించింది.
అత్యధిక వర్షపాతం బెంగళూరు రూరల్ జిల్లా వెంకటగిరి కోటెలో నమోదైంది. ఇక్కడ 150 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. గొట్టిగెరె, చౌడేశ్వరి, యలహంక న్యూ టౌన్, యలహంక ఓల్డ్ టౌన్, భాగలూరు, కట్టిగెనహళ్లి, హెబ్బాళ, సహకారనగర, విద్యారణ్యపుర, ఎంఎస్ పాళ్య, టాటానగర్, బ్యాటరాయనపుర, అమృతహళ్లి, జక్కూరు వంటి ప్రాంతాల్లో ఈ వర్షాల తీవ్రత అధికంగా పడింది.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గాలన్నీ నీటితో నిండిపోయాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. గంటల కొద్దీ వాహనదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది. విద్యారణ్యపుర పరిధిలోని దొడ్డబొమ్మసంద్ర పార్క్ చెరువు పూర్తిస్థాయి గరిష్ఠ మట్టానికి చేరుకుంది.
రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్లౌడ్ బరస్ట్ వల్ల కుండపోత వర్షం సంభవించినట్లు వివరించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలో 45 వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినట్టు గుర్తించామని చెప్పారు.
ఈ పరిణామాల మధ్య మరోసారి బెంగళూరులో భారీ వర్షం మొదలుకావడం బెంబేలెత్తిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికీ ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం దంచికొడుతోంది. మళ్లీ రాత్రంతా వర్షం పడుతుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications