కొన్ని గంటల్లో రికార్డుస్థాయి వర్షపాతం- వాహనదారులు విలవిల
Chennai rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- దక్షిణ కోస్తా తీర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమౌతూ వస్తోంది.

ఇదే తరహా పరిస్థితులు అటు తమిళనాడులోనూ నెలకొంది. ప్రత్యేకించి- ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలమౌతోన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అటు బెంగళూరులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తెల్లవారు జామున ఆరంభమైన కుండపోత వర్షం.. ఏకధాటిగా మధ్యాహ్నం వరకూ కొనసాగింది. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. 70 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది.

బొమ్మసంద్ర, శేషాద్రిపురం, రాజరాజేశ్వరి నగర, రాజాజీనగర, గాంధీనగర, శాంతినగర, మెజస్టిక్, కేఆర్ మార్కెట్, హెబ్బాళ, విద్యారణ్యపుర, యలహంక, హెచ్ఏఎల్, యశ్వంత్‌పుర, హెచ్ఎంటీ లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్.. వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపునీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.
చిక్‌బళ్లాపుర జిల్లా దేవనహళ్లి, దొడ్డబళ్లాపుర, నెలమంగళ, హొస్కోటే, బెంగళూరు రూరల్ బన్నేరుఘట్ట, అత్తిబెలెల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. బెంగళూరుతో సరిహద్దులను పంచుకుంటోన్న తమిళనాడులోని హోసూరులో కుండపోతగా వర్షం కురవడం వల్ల ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఇదే తరహా పరిస్థితులు ఇంకో మూడు రోజులు అంటే ఈ నెల 18వ తేదీ వరకు ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే వర్షపుపోటుకు గురైన బెంగళూరు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బీబీఎంపీ అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications