తీవ్ర అసంతృప్తి: తప్పుకొన్న దేవర
Bharat Jodo Nyay Yatra: సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి ఇండియా సమాయాత్తమౌతోంది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక ఓటుబ్యాంకును కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది.
ఈ క్రమంలో కూటమి ప్రధాన భాగస్వామిగా ఉంటోన్న కాంగ్రెస్ పార్టీ.. జనంలోకి వెళ్తోంది. ఇందులో భాగంగా- మలి విడత భారత్ జోడో యాత్రను చేపట్టింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవర.. రాజీనామా చేశారు. 55 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకున్నారు. ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన నేత.. మిలింద్ దేవర. ఇదివరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. రాహుల్ గాంధీకి ఆప్తుడిగా పేరుంది. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాల వల్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంటోన్నారాయన. ముంబై సౌత్ లోక్‌సభ స్థానాన్ని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనకు కేటాయించడం ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.
ఇది ఆయన సొంత నియోజకవర్గం. 2004, 2009లో ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈ స్థానం నుంచే మళ్లీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. దీన్ని ఉద్దవ్ థాకరే వర్గానికి కేటాయించడాన్ని మిలింద్ దేవర తప్పు పడుతున్నారు.

ఈ కారణంతోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనలో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పార్టీ అభ్యర్థిగా ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని అంటున్నారు. మిలింద్ దేవర రాజీనామాపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ స్పందించారు.
మిలింద్ తండ్రి మురళీ దేవరను గుర్తు చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మురళీ దేవర పార్టీని వీడలేదని గుర్తు చేశారు. జ్యోతిరాదిత్య సింధియాలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిలింద్ దేవరకు ఏదైనా ఒక హామీ ఇచ్చి ఉంటారని, అందుకే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications