Bhargavastra: కలియుగంలో పరశురాముడి అస్త్రం దిగింది..
ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్‌ల హవా బాగా పెరిగిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నుంచి పశ్చిమాసియా ఘర్షణల వరకు శత్రువుల కదలికలను నిఘా వేయాలన్నా, విద్వంసక దాడులు చేయాలన్నా అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొన్నటి మన 'ఆపరేషన్ సిందూర్'లో కూడా డ్రోన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటువంటి తరుణంలో శత్రు దేశాల డ్రోన్లు, స్వామ్ డ్రోన్‌లను ఆకాశంలోనే చిత్తు చేసేందుకు భారత్ సరికొత్త రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. అదే స్వదేశీ సాంకేతికతతో తయారై.. పరశురాముడి దివ్యాస్త్రం పేరులోని గంభీరతను, శక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన 'భార్గవాస్త్ర'.
నాగ్‌పూర్‌లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ నిపుణులు రూపొందించిన ఈ 'భార్గవాస్త్ర' కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఇటీవల భారత ఆర్మీ బృందం స్వయంగా పరిశీలించింది. మేక్-2 ప్రోగ్రామ్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్ ద్వారా ఒకేసారి దూసుకొచ్చే డ్రోన్ గుంపును గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, లక్ష్యాలను నిర్దేశించి దాడికి సిద్ధమవడం వరకు అంతా విజయవంతంగా ప్రదర్శించారు. రక్షణ భద్రతా నిబంధనల వల్ల నేరుగా రాకెట్లు పేల్చకపోయినప్పటికీ, ఈ సిస్టమ్ పనిచేసే విధానంపై ఆర్మీ అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

10 కిలోమీటర్ల దూరంలోనే గుర్తింపు.. జామర్లకు దొరకని సమాధానం!
సాధారణంగా డ్రోన్లను నిలువరించడానికి ఎలక్ట్రానిక్ జామర్లు లేదా రేడియో సిగ్నళ్లను నిలిపివేసే పద్ధతులు వాడతారు. కానీ అధునాతన ఆటోమేటిక్ డ్రోన్లు ఇటువంటి జామర్లకు దొరకవు. అందుకే భార్గవాస్త్ర ప్రత్యక్ష దాడి పద్ధతిని ఎంచుకుంది. 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద డ్రోన్లను, దగ్గరగా వచ్చే చిన్న డ్రోన్లను కూడా అత్యాధునిక రాడార్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సహాయంతో ఇది పసిగడుతుంది. ఆ తర్వాత మైక్రో-రాకెట్లు, నిశిత లక్ష్యాలను ఛేదించే మైక్రో-మిస్సైళ్లతో శత్రు డ్రోన్‌లను నిమిషాల వ్యవధిలో నాశనం చేస్తుంది.
మంచు కొండలైనా.. ఎడారులైనా సిద్ధమే!
సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తైన లడఖ్ లాంటి మంచు పర్వత ప్రాంతాలతో పాటు మైదానాలు, ఎడారి ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా ఈ భార్గవాస్త్రాన్ని డిజైన్ చేశారు. మన సాయుధ దళాల వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లతో ఇది సులువుగా అనుసంధానమవుతుంది. దీనికి అయ్యే వ్యయం కూడా చాలా తక్కువ. శత్రువులు పంపే చవకబారు డ్రోన్‌లను కూల్చడానికి కోట్ల రూపాయల ఖరీదైన పెద్ద మిస్సైళ్లను వాడాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో కూడిన ఈ మైక్రో-రాకెట్లతోనే పనిచేయడం వల్ల భారత సైన్యానికి ఆర్ధికంగానూ ఎంతో కలసివస్తుంది.
డ్రోన్ హబ్‌గా భారత్.. రక్షణ శాఖ పిలుపు!
భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్ని మార్చబోయే డ్రోన్, ఏఐ, రోబోటిక్స్ రంగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే గ్లోబల్ స్థాయిలో స్వదేశీ డ్రోన్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతం చేశామని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. భార్గవాస్త్ర రాకతో భారత సరిహద్దు భద్రత మరింత గట్టిపడటమే కాకుండా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు సరికొత్త ఊపు లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH | Solar Defence and Aerospace Ltd. (SDAL) demonstrated "Bhargavastra", an indigenous, vehicle-mounted, multi-layered Counter-Swarm Drone System, to the three defence services including the Indian Army, Indian Navy and Indian Air Force at its Nagpur facility on July 23–24.… pic.twitter.com/2QUkLuPHfJ
— ANI (@ANI) July 24, 2026












Click it and Unblock the Notifications