Indigo-Airbus : ఏవియేషన్ చరిత్రలోనే భారీ డీల్-500 ఎయిర్ బస్ లకు ఇండిగో ఆర్డర్..
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న భారత విమానయాన రంగంలో ఇవాళ పెను సంచలనం నమోదైంది. 500 ఎయిర్ బస్ ఏ 320 విమానాల కొనుగోలుకు ఇవాళ ప్రైవేటు ఎయిర్ లైన్స్ ఇండిగో ఆర్డర్ పెట్టింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఉన్న విమానాలు నడపడమ గగనంగా మారిన పరిస్దితుల్లో కొత్తగా విమానాలు కొనేందుకు ఇండిగో చేసుకున్న ఒప్పందం భారత విమానయాన రంగంలో పెనుమార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.
ఎయిర్ ఇండియాను టాటాలకు విక్రయించిన తర్వాత విమానయాన రంగంలో ప్రైవేటు సంస్ధల పోటీ మరింత పెరిగింది. దీంతో పలు ప్రైవేటు ఎయిర్ లైన్స్ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో పోటీని తట్టుకునేందుకు వీలుగా ఇండిగో ఇంత భారీ ఒప్పందం చేసుకోవడం విశేషం.

ఇవాళ పారిస్ ఎయిర్ షోలో ఇండిగో బోర్డ్ ఛైర్మన్ వి సుమంత్రన్, ఇండిగో సిఇఒ పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సిఇఒ గుయిలౌమ్ ఫౌరీ, ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ షెరర్ హెడ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంతో 500 A320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ ల ఆర్డర్ "వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద సింగిల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన రికార్డ్" అని ఎయిర్‌బస్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌బస్‌తో చేసుకున్న 500 విమానాల కొనుగోలు ఒప్పందం భవిష్యత్తులో విమానయాన రంగంలో పెనుమార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ఇటీవల ఎయిర్ ఇండియా 470-విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసి ఓ రికార్డు సృష్టించగా.. ఇవాళ ఇండిగో 500 విమానాలతో ఆ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్ధానంలో నిలిచింది.తాజా ఒప్పందంతో ఇండిగో ఆర్డర్ చేసిన మొత్తం ఎయిర్‌బస్ విమానాల సంఖ్యను 1,330కి తీసుకెళ్లింది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద A320 ఫ్యామిలీ విమానాల కస్టమర్‌గా కూడా రికార్డు సృష్టించిందని ఎయిర్ బస్ పేర్కొంది.
ఇది ఇండిగోకు 2030-2035 మధ్య మరింత స్థిరమైన డెలివరీలను అందిస్తుందని, ఈ 500 ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్ ఇండిగో యొక్క అతిపెద్ద ఆర్డర్ మాత్రమే కాదు, ఎయిర్‌బస్‌తో ఏ విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద సింగిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు కూడా అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications