MH Elections: హర్యానా ఎఫెక్ట్ - మహారాష్ట్ర పై మోదీ కొత్త వ్యూహం..!!
Maharashtra Elections: బీజేపీలో సమరోత్సాహం పెరిగింది. హర్యానాలో హ్యాట్రిక్ విజయం తో కొత్త జోష్ పార్టీలో కనిపిస్తోంది. జమ్ములో అధికారం దక్కకపోయినా వచ్చిన సీట్లు..ఓట్లు బీజేపీకి బూస్టప్ గా మారింది. దీంతో..త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం మహారాష్ట్ర పైన ఉంటుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. అక్కడ వ్యూహాల పైన ప్రధాని కసరత్తు చేస్తున్నారు.
బీజేపీకి కలిసొచ్చేనా
తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీ త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. హర్యానాలో విజయం ఖాయమని...ఆ ఫలితాలతో వచ్చే రెండు రాష్ట్రాల ఎన్నికలకు సిద్దం కావాలని ఇండియా కూటమి ప్రణాళికలు సిద్దం చేసింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ సైతం హర్యానాలో కాంగ్రెస్ కు అనుకూలంగా చెప్పినా..వాస్తవ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల తరువాత మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ నాయకత్వానికి తాజా ఫలితాలు కొత్త శక్తిని ఇచ్చాయి.

హర్యానాలో గెలుపుతో
ప్రధానంగా హిందీ బెల్ట్ లో కీలకంగా ఉన్న హర్యానాలో తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించటం బీజేపీ నేతలకు బలం పెంచింది. హర్యానాలో మరోసారి విజయంతో బీజేపీ ఖాతాలో 13వ రాష్ట్రంగా చేరింది. హర్యానాలో బీజేపీ గెలవకపోయి ఉంటే రాజకీయ సమీకరణాలు మరో విధంగా ఉండేవి. మిత్రపక్షాలుగా ఉన్న ఎల్జేజీ, జేడీ(యూ)తో పాటుగా ఇతర మిత్రపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి పెరిగేది. హర్యానాలో గెలుపు, జమ్ములో సీట్లు మిత్రపక్షాలు సైతం బీజేపీతో సర్దుబాటు ధోరణితో వెళ్లేందుకు మార్గం సుగమం చేసాయి. హర్యానాలో గత రెండు సార్లు కంటే బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లు దక్కించుకుంది.
మహారాష్ట్ర పైన ఫోకస్
జమ్ముకశ్మీర్‌లోనూ బీజేపీకి వచ్చిన సీట్లతో బలం పెంచుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ పైన ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోనూ బీజేపీ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి తో బీజేపీ తలపడుతోంది. అక్కడ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత పూర్తిగా తమ మీద ఉండదనే అభిప్రాయంతో ఉంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే సగం టర్మ్ పని చేయటంతో...ప్రస్తుతం ప్రారంభించిన కార్యక్రమాలు కొనసాగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్లాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. మహారాష్ట్రలో గెలుపును ప్రధాని మోదీ, అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. వచ్చే వారం మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications