మూడు రాష్టాల్లో సీఎంలుగా వారే? 2024లో ఎంపీలే టార్గెట్ గా బీజేపీ తాజా వ్యూహం..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రుల ఎంపిక సవాలుగా మారుతోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే కీలకమైన మూడు హిందీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో జోరు మీదున్న బీజేపీ.. జాగ్రత్తగా పావులు కదిపితే ఇక్కడి నుంచి భారీగా ఎంపీల్ని గెలిపించుకోవచ్చనే ఆలోచనలో ఉంది. దీంతో మూడు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవికి బీజేపీ కొత్త ముఖాలను ఎంపిక చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరి ఎంపిక జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులపై పార్టీ కేంద్ర నాయకత్వం చర్చలు జరుపుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో నాలుగున్నర గంటలపాటు జరిగిన భేటీలో మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్ధుల పేర్లను పరిశీలించారు.

మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్ధుల ఎంపిక కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించే అవకాశం ఉంది. ఈ పరిశీలకులు అసెంబ్లీలో తమ నాయకులను ఎన్నుకునేందుకు మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షిస్తారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ఆ పదవికి రేసులో ముందున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా కూడా పోటీలో ఉన్నారు.
రాజస్థాన్ లో సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, సీనియర్ నేతలు దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్‌లు కూడా ఉన్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవికి పోటీ పడుతున్న వారిోల మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి ఉన్నారు.












Click it and Unblock the Notifications