లఖీంపూర్ చిచ్చు- వరుణ్ గాంధీ, మేనకకు బీజేపీ షాక్-జాతీయ కార్యవర్గం నుంచి ఉద్వాసన
బీజేపీలో అగ్రనేతలు వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీకి అధిష్టానం భారీ షాకిచ్చింది. తాజాగా లఖీంపూర్ లో జరిగిన హింసాకాండను ఖండిస్తూ తాజాగా వరుణ్ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ ఇవాళ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వారిద్దరికీ చోటివ్వలేదు.
80 మందితో కూడిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లకు చోటు దక్కింది. బీజేపీకి చెందిన కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకూ ఇందులో చోటు కల్పించారు. తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్ వంటి వారికి కూడా ఇందులో చోటు దక్కింది. కానీ ఇప్పటికే జాతీయ వర్గ సభ్యులుగా ఉన్న వరుణ్ గాంధీ, మేనకాగాంధీని మాత్రం తప్పించారు.
బీజేపీ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో 80 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ఇందులో ఏ జాబితాలోనూ వరుణ్ గాంధీతో పాటు మేనకాగాంధీకి చోటు దక్కలేదు. ఇప్పటికే కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదని వరుణ్ అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన మేనకాగాంధీ ఆ తర్వాత తప్పించారు. దీంతో వీరిద్దరూ బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

ఇదే సమయంలో తాజాగా చోటు చేసుకున్న లఖీంపూర్ హింసపై యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జవాబుదారీతనం ప్రదర్శించాలని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై యోగీతో పాటు బీజేపీ హైకమాండ్ పెద్దలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ కార్యవర్గంలో వరుణ్ తో పాటు ఆయన తల్లి మేనకను కూడా తప్పించినట్లు తెలుస్తోంది.
లఖీంపూర్ హింస నేపథ్యంలో యూపీలో విపక్షాలతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా యోగీ సర్కార్ తో పాటు కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో యోగీ అంటే పడని వారితో పాటు ఇతర ప్రత్యర్ధులు కూడా ఈ వ్యవహారంలో యోగీ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు ట్వీట్లు కూడా చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఈ అసంతృప్తులకు ఝలక్ ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ యోగీ సర్కార్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అసంతృప్తులు కాషాయ పార్టీకి తలనొప్పిగా మారాయి.












Click it and Unblock the Notifications