పార్శిల్ బాంబు: ప్రజాప్రతినిధి టార్గెట్, బాడీగార్డు అంతం
పట్నా: బీహార్ లో రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసుకుని పార్శిల్ బాంబు పంపించారు. పార్శిల్ ఒపెన్ చేసిన రాజకీయ నాయకుడి బాడీగార్డు దుర్మరణం చెందాడు. మంగళవారం గయాలో సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగాగా ఉన్నాయి.
జేడీ(యు) పార్టీ గయా జిల్లా (రూరల్) అధ్యక్షుడు అభయ్ కుశ్వాహ్ గయాలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఆయన ఇంటిలోనే ఉన్నారు. ఇంటి బయట అభయ్ బావ, బాడీగార్డు నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో వారికి ఒక పార్శిల్ వెళ్లింది.
బాడీగార్డు పార్శిల్ విప్పుతున్న సమయంలో ఒక్క సారిగా పేలిపోయింది. ఈ బాంబు పేలుడులో బాడీగార్డు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. అభయ్ బావకు తీవ్రగాయాలు కావడంతో గయాలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

విషయం తెలుసుకున్న ఏడీజీపీ సునీల్ కుమార్, జిల్లా ఎస్పీ మను మహరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ పార్శిల్ బాంబు దాడి నుండి తప్పించుకున్న అభయ్ ని విచారణ చేసి వివరాలు సేకరించారు.
రాజకీయ కక్షల కారణంగా అభయ్ ని అంతం చెయ్యాలని ప్లాన్ వేశారా, మావోయిస్టులకు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఏడీజీపీ సునీల్ కుమార్ అన్నారు. గయా లోని ఒక కోరియర్ కంపెనీ నుండి అభయ్ ఇంటికి పార్శిల్ లో బాంబు వచ్చిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications