ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉన్నంత మాత్రాన భారతీయులు కాదు..
ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడీ వంటి గుర్తింపు పత్రాలు ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం లభించదని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయుడి బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
నకిలీ పత్రాలతో దశాబ్దం పాటు నివాసం..
ఆరోపణల ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన బాబు అబ్దుల్ రూఫ్ సర్దార్ దాదాపు పదేళ్లుగా నకిలీ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్నాడు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి పత్రాలు సేవలు పొందేందుకు మాత్రమేనని, పౌరసత్వం పొందడం కోసం పౌరసత్వ చట్టం నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని జస్టిస్ అమిత్ బోర్కర్ స్పష్టం చేశారు. సర్దార్ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని, నకిలీ భారతీయ పత్రాలు, పాస్‌పోర్ట్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ, పత్రాల ధృవీకరణ ఇంకా కొనసాగుతుందని కోర్టు తెలిపింది.

పౌరసత్వ చట్టం ప్రాముఖ్యత..
జస్టిస్ బోర్కర్ 1955 పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావిస్తూ, భారత పౌరసత్వం లభించే విధానం, కోల్పోయే పరిస్థితులను ఈ చట్టం స్పష్టంగా వివరిస్తుందని గుర్తుచేశారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి పత్రాలు కేవలం గుర్తింపుకోసమేనని, పౌరసత్వానికి అవసరమైన ప్రాథమిక చట్టపరమైన అర్హతలను అవి భర్తీ చేయలేవని పేర్కొన్నారు. పౌరసత్వ చట్టం చట్టబద్ధమైన పౌరులు, అక్రమ వలసదారుల మధ్య తేడాను స్పష్టంగా చూపుతుందని హైకోర్టు వివరించింది. అక్రమ వలసదారులకు పౌరసత్వం లభించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, ఇది దేశ సార్వభౌమత్వం రక్షణకు, పౌరుల హక్కుల కాపాడటానికి అవసరమని పేర్కొంది.
బెయిల్ నిరాకరణకు కారణాలు..
పోలీసుల ప్రకారం.. బెయిల్ మంజూరు చేస్తే సర్దార్ పారిపోవచ్చని కోర్టు అంగీకరించింది. ఈ కేసు కేవలం వలస నిబంధనల ఉల్లంఘన కాకుండా, భారత పౌరుడిగా నటించేందుకు నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించడం, ఉపయోగించడం వంటి తీవ్రమైన ఆరోపణలను కలిగి ఉందని ధర్మాసనం పేర్కొంది.
చట్టపరమైన అభియోగాలు..
సర్దార్‌పై భారతీయ న్యాయసంహిత, పాస్‌పోర్ట్ (ఎంట్రీ టు ఇండియా) చట్టం, విదేశీయుల ఆదేశాల కింద అభియోగాలు మోపబడ్డాయి. ఆధార్ కార్డు ప్రామాణికతపై UIDAI ధృవీకరణ కొనసాగుతోందని కోర్టు తెలిపింది.

నిందితుడి వాదనలు..
తాను భారత పౌరుడినేనని, బంగ్లాదేశ్ జాతీయుడని నిరూపించే ఆధారాలు లేవని సర్దార్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన పత్రాలు ఆదాయపు పన్ను రికార్డులు, వ్యాపార రిజిస్ట్రేషన్‌తో అనుసంధానించబడి ఉన్నాయని, 2013 నుండి థానేలో నివసిస్తున్నానని వాదించాడు.












Click it and Unblock the Notifications