రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం!
నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రూపొందించిన 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం కోసం ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలను ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నవంబర్‌లో దీనిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ప్రారంభమయ్యాక అర్హులైన వారికి మద్దతు అందించి, వారు స్వంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహించనున్నామన్నారు. జిల్లా స్థాయిలో కమిటీలు పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ పథకం అమలుతో నిరుద్యోగ సమస్యకు కొంత మేరకైనా పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. తాజాగా ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన 1.3 లక్షల మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌ల కింద రూ. 450 కోట్లు నేరుగా జమ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
బీసీ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. కాటమయ్య రక్షణ కవచాల పథకం కింద 50 వేల మందికి కిట్‌లు మంజూరు చేశామని, వీరిలో 40వేల మందికి ఇప్పటికే పంపిణీ చేశామని, మిగిలిన 10 వేల మందికి త్వరలో అందిస్తామని చెప్పారు. ఈ రక్షణ కిట్‌ల కోసం ప్రభుత్వం రూ. 60కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన ఆహార, సబ్బులు, నూనె, పౌడర్ వంటి ఖర్చులను వారి ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బీసీ గురుకుల విద్యా సంస్థల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ఈ ఏడాదికి గాను బీసీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద 180 మంది లబ్ధిదారులకు రూ. 18.40 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు విదేశీ విద్య కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నామన్నారు. ఆత్మ గౌరవ భవనాల కోసం నిధులను కూడా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications
