ఈ అకాల వర్షాలతో మేం నష్టపోయాం.. ఇంద్ర దేవుడిపై కేసు పెట్టిన యువకుడు
గోపాల గోపాల మూవీ గుర్తుందా.. వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో గోపాల్ రావు అనే పాత్రలో వెంకటేశ్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఓ రోజు భూకంపం వల్ల గోపాల్ రావు షాపు పూర్తిగా ధ్వంసం అవుతుంది. అయితే భీమా కంపెనీకు వెళ్తే ఇది ప్రకృతి వైపరీత్యం అని అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అని అందువల్ల తాము క్లెయిమ్ ఇవ్వలేమని చెప్తారు. దాంతో తన షాపు ధ్వంసం కావడానికి దేవుడే కారణం అని భావించి దేవుడిపైనే కేసు వేస్తాడు గోపాల్ రావు. అయితే ఇప్పుడు ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఈ అకాల వర్షాలతో సాధారణ జీవనం దెబ్బతిందని ఓ యువకుడు ఇంద్ర దేవుడిపై ఫిర్యాదు చేశాడు. యూపీలోని ప్రభుత్వ పబ్లిక్ గ్రీవాన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు సమర్పించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోలీకు చెందిన సూరజ్ తివారీ ఏకంగా దేవుడిపైనే ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొన్ని సార్లు భారీ వర్షాలు పడుతున్నాయి.. మరికొన్ని సార్లు తక్కువ వర్షాలు పడుతున్నాయి.. ఇలా వరుసగా విపరీతమైన వర్షాల కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతింది. ఇంద్ర దేవుడు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గంటల కొద్దీ భారీ వర్షాలను కురిపిస్తున్నాడు. దాంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రోడ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. పంట నష్టం కారణంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అందువల్ల వారి జీవన విధానం పూర్తిగా దెబ్బతింది.. ఈ క్రమంలోనే సూరజ్ తివారీ ఇంద్ర దేవుడిపై ఫిర్యాదు చేశాడు.

" ఇంద్ర దేవుడి మొబైల్ నంబర్ నాకు తెలియదు. అందువల్ల నేను జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేసేది ఏంటంటే..? తక్షణమే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మీరు ఎలాగైనా ఇంద్ర దేవుడిని సంప్రదించి తక్షణమే వర్షాలను కంట్రోల్ కు తీసుకురావాలని కోరుతున్నాను. దాంతో జిల్లాలోని ప్రజలకు ఉపశమనం లభిస్తుంది " అని సూరజ్ తివారీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాల కారణంగా ఏడుగురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేవలం ఈ మాన్ సూన్ సీజన్ లోనే ఏకంగా 56 మంది వర్షాల కారణంతో మృతి చెందారు. అలాగే 30 వరకు పశువులు మృతి చెందగా.. 330 నివాసాలు ధ్వంసం అయ్యాయి.












Click it and Unblock the Notifications
