వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే!

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బూరుగు

సూర్యాస్తమయం తర్వాత అక్కడ గిరిజన గ్రామాలున్నాయని గమనించలేం. ఎందుకంటే అక్కడ అంతా గాఢమైన చీకటే. కారణం తరాలుగా ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడమే.

ఇలా సూర్యాస్తమం తర్వాత కనిపించని గ్రామాలు తూర్పు కనుమల్లో చాలా ఉన్నాయి. వాటిలో బూరుగుకు బీబీసీ తెలుగు బృందం వెళ్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొంపల్లి పంచాయతీలో ఉండే గిరి శిఖర గ్రామం ఇది.

బూరుగులోనే ఒక రాత్రి బస చేసి, అక్కడ పరిస్థితులను పరిశీలించింది. ఈ గ్రామాన్ని సాయంత్రం 6.30 నుంచి చీకటి క్రమంగా కప్పేస్తుంది. ఆ తర్వాత వంట, ఇంటి పని, భోజనాలు, చదువులు చీకట్లోనే. రాత్రి సమయంలో సెల్ ఫోన్ టార్చ్, పొయ్యి వెలుగు, హెడ్ ల్యాంప్ ద్వారా గ్రామంలోని పరిస్థితులను చూశాం.

బూరుగు

'నా గడ్డి ఇల్లు కాలిపోయింది, అయినా కొత్త ఇంటిలో కూడా గడ్డి పొయ్యి పెట్టుకున్నాం’

గ్రామంలో 75 వరకు ఇళ్లు ఉన్నాయి. వీటిని గడ్డి, వెదురు, పెంకులు, సింమెట్ రేకులతో నిర్మించుకున్నారు. ఎక్కువగా గడ్డి ఇల్లే ఉన్నాయి. దాదాపు అన్నీ ఇళ్లు ఒక గది ఉన్న ఇళ్లే. ఈ గదిలోనే కట్టెల పొయ్యి కూడా ఉంది. ఆ పొయ్యి కారణంగా ఇళ్లన్ని నల్లని పొగ పట్టి ఉన్నాయి. ఒకే గదున్న ఇంటి లోపలే పొయ్యి ఎందుకు కట్టుకున్నారో సన్యాసిరావు బీబీసీతో చెప్పారు.

“ఆరు నెలల క్రితం నా ఇల్లు కాలిపోయింది. రాత్రంతా పొయ్యిలో కట్టెలు కాలుతుండటంతో అగ్గి అంటుకుని ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కొత్తది కట్టుకున్నాను. కొత్త ఇంటిలో కూడా పొయ్యి ఇంటి లోపలే పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు కరెంట్ ఉండదు. చీకటి పడగానే ఆ పొయ్యిని వెలిగించి ఆ వెలుగులోనే మేం అన్నం, కూరలు వండుకుంటాం. ఇల్లు సర్దుకుంటాం. పిల్లలు ఆ వెలుగులోనే చదువుకుంటారు. వంట అయిపోయినా కూడా వెలుగు కోసం ఆ నిప్పులను ఆర్పం. అదే ఒక్కొక్కసారి మా ఇళ్లను కాల్చేస్తుంది. అది తప్ప మాకు వెలుగు పొందేందుకు మరో ఆధారం లేదు” అని సన్యాసిరావు చెప్పారు.

బూరుగు

'మా ఆవిడ గర్భవతి...అందుకే సెల్ ఫోన్ వాడుతున్నా’

వెలుగు కోసం గ్రామంలో ఎవరు కూడా సెల్ ఫోన్ టార్చ్‌లను, మరే ఇతర బ్యాటరీ లైట్లను వాడరు. గ్రామంలో నెట్ వర్క్ లేకపోయినా కొందరు యువకుల వద్ద సోల్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో టార్చ్ లైట్ సౌకర్యం ఉన్నా కూడా ఆ ఫోన్లను ఉపయోగించరు. కానీ అప్పలరాజు అనే గిరిజనుడు ఇంట్లో మాత్రం సెల్ ఫోన్, హెడ్ లైట్, పొయ్యి వెలుగు మూడింటిని వాడుతున్నారు.

“మా బూరుగు గ్రామంలో నాతో పాటు కొందరి వద్ద సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇటీవల రూ. 350 పెట్టి హెడ్ ల్యాంప్ కొన్నాను. ఇప్పుడు మా ఇంట్లో తప్ప గ్రామంలో ఎక్కడ సెల్ ఫోన్, హెడ్ ల్యాంప్ వెలుగు కనిపించదు. గతంలో అందరిలానే మేం కూడా పొయ్యి వెలుగుపైనే ఆధారపడి పనులు చేసుకునే వాళ్లం. అయితే ప్రస్తుతం మా ఆవిడ ఆరు నెలల గర్భవతి. అందుకే ఆవిడకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని లైటింగ్ కోసం సెల్ ఫోన్, హెడ్ ల్యాంప్ తీసుకున్నాను” అని అప్పలరాజు బీబీసీతో చెప్పారు.

అప్పలరాజు, పోలమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.

బూరుగు

'పాములను కనిపెట్టాలి... పిల్లలు, ఫోన్ చార్జింగ్‌ను కాపాడుకోవాలి’

పోలమ్మ ఐదో తరగతే చదివారు. నాలుగో బిడ్డను గర్భంలో మోస్తున్న పోలమ్మ విద్యుత్ లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. ముఖ్యంగా రాత్రి సమయంలో మలమూత్ర విసర్జనకు చీకట్లో వెళ్లడం, భయంగా ఉంటుందని ఆమె బీబీసీతో చెప్పారు.

“చీకట్లో అటూఇటు వెళ్లడం చాలా కష్టంగా ఉంటోంది. మా గ్రామంలో పాములెక్కువ తిరుగుతున్నాయి. రాత్రి పడుకునే సమయంలో ఏదైనా అలికిడైతే పాములేమోనని వెంటనే పిల్లల్ని నా వైపుకు లాక్కుంటాను. నా భర్త సెల్ ఫోన్ లైట్ వేసి నాలుగు వైపులా చూస్తారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందనే గ్రామంలో ఎవరు కూడా ఏ పనికంటే ఆ పనికి సెల్ ఫోన్ లైట్‌ను ఉపయోగించరు. ఎందుకంటే ఛార్జీంగ్ అయిపోతే మళ్లీ 20 కిలోమీటర్లు వెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవాలి” అని పోలమ్మ తెలిపారు.

బూరుగు

'చెట్ల మధ్యలో కాగడాలు దాస్తాం’

కొండదొర గిరిజనం ఉండే బూరుగు గ్రామానికి చేరుకోవాలంటే నిలువుగా 4 కిలోమీటర్లు కొండపైకి ఎక్కాలి. ఇక్కడ మొత్తం 75 కుటుంబాల్లో సుమారు 300 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరి వృత్తి పోడు వ్యవసాయం. వారానికి రెండు, మూడు రోజులు కూలీ పనుల కోసం, మరో ఒకట్రెండు రోజులు సంతలకు కొండ కిందకు వీరు వెళ్తుంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ తిరిగి గ్రామాన్ని చేరుకునేటప్పటికీ చీకటైపోతుంటుందని బూరుగు గ్రామస్థులు తెలిపారు.

“వ్యవసాయం పని రోజూ ఉండదు. అండ్ర, మెంటాడ జంక్షన్ల వద్ద ఉంటే ఏదో మేస్ట్రీల వద్ద కూలీ పనులు దొరుకుతాయి. పని పూర్తి చేసుకుని మళ్లీ అండ్ర, మెంటాడ వచ్చేసరికి చీకటైపోతుంది. ఆ చీకట్లో 4 కిలోమీటర్లు రాళ్లు, రప్పులున్న కొండని ఎక్కాలి. ఆ చీకట్లో పాములు, అడవి పందుల నుంచి రక్షణ కోసం కాగాడాలను వెలిగిస్తాం. అయితే ఆ కాగడాలను దారిలోని కొన్ని కొన్ని చోట్ల చెట్ల మధ్యలో ఉంచుతాం. వాటిని వెలిగించి... పాటలు పాడుకుంటూ గుంపులుగా గ్రామానికి చేరుకుంటాం. మాకు కొండపైకి వెళ్లే మార్గంలో కానీ, మా గ్రామంలో కానీ విద్యుత్ వెలుగు ఉండదు” అని కూలీ పనులకు వెళ్లే కొత్తయ్య బీబీసీతో చెప్పారు.

బూరుగు

'నేను పుట్టి 68 ఏళ్లు, మాకు రోజంటే 12 గంటలే’

“నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. పదేళ్ల, పదకొండేళ్ల క్రితం సోలార్ ప్లేట్లు పెట్టి కరెంట్ ఇస్తామన్నారు. రెండు విద్యుత్ స్తంభాలు కూడా పాతారు. విద్యుత్ లైట్లు ఎలా వెలుగుతాయో చూద్దామని అనుకుంటే సోలార్ ప్లేట్లే పాడైపోయాయి. మళ్లీ ఆ తర్వాత నుంచి కరెంట్ లేదు, దాని ఊసు లేదు” అని లచ్చయ్య బీబీసీతో చెప్పారు.

నాకు తెలిసినప్పటి నుంచి ఈ గ్రామంలో చీకటిపడితే మళ్లీ సూర్యోదయం కోసం ఎదురు చూడడమే కానీ... చీకట్లో ఏ పని చేయలేమని లచ్చయ్య తెలిపారు.

“గ్రామంలో ఎటు చూసినా పొయ్యి మంటలు మీద ఆధారపడి పనులు చేసుకునే ఇళ్లే కనిపిస్తాయి. ఆ వెలుగులోనే ఇంటిలోని వారందరూ ఒకరి తర్వాత ఒకరు భోజనాలు చేస్తారు. కొందరు యువకులు సెల్ ఫోన్ వెలుగులో భోజనం చేస్తారు. ఇలా కరెంట్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. కరెంట్‌తో పాటు రోడ్లు కూడా కావాలి”అని లచ్చయ్య అన్నారు.

బూరుగు

'నాలుగు వైపులా కట్టెలు వెలిగించి పెళ్లి చేస్తాం’

గ్రామంలో అంతా పోడు వ్యవసాయమే చేస్తారు. ఒక రోజు గ్రామమంతా ఒకరి పొలంలోకి వెళ్లి పని చేస్తే... మరుసటి రోజు మరోకరి పొలంలోకి వెళ్తారు. దాంతో గ్రామంలో ఆ వ్యవసాయ పనులతో పాటు ఏదైనా పండుగలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల కోసం మాట్లాడుకోవాలంటే అంతా రాత్రి వేళ్లలో సమావేశమవుతారు. కరెంట్‌లేని ఆ గ్రామంలో రాత్రి వేళల్లో క్యాంప్ ఫైర్స్ వేసుకుని సమావేశాలు నిర్వహించుకుంటారు.

“మా గ్రామంలో పండగ, పెళ్లి, మీటింగు ఏదీ జరిగినా, రాత్రి వేళల్లోనే పెట్టుకుంటాం. ఎందుకంటే ఉదయం సమయంలో మాకు పొలం పనులుంటే, కూలికి పోయే వారు రాత్రికి కానీ ఇంటికి చేరుకోరు. అందుకే రాత్రిళ్లే సమావేశాలు పెట్టుకుంటాం. కరెంట్ సౌకర్యం లేని గ్రామం కావడంతో అగ్గి మంటలేసుకుని ఆ వెలుగులోనే చర్చలు జరుపుకుంటాం. పెళ్లిళ్లు కూడా నాలుగు వైపులా మంట పెట్టి ఆ వెలుగులోనే చేస్తుంటాం” అని సింహాచలం చెప్పారు.

బూరుగు

'ప్రధాని మోదీ గారు ఇటు వైపు చూడండి’

'ఉజ్వల భారత్-ఉజ్వల భవిష్యత్తు-పవర్ 2047’ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యుత్ మహోత్సవంలో విద్యుత్ సౌకర్యం ఎలా ఉందంటూ చింతపల్లి మండలంలోని రత్నగిరి కాలనీ వాసులతో ప్రధాని నరేంద్ర మోదీ జులై 30న అన్‌లైన్‌లో మాట్లాడారు.

ఈ గ్రామానికి 2017లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద విద్యుత్ వచ్చింది. విద్యుత్ లేని బూరుగు, చినకోనెల వంటి గ్రామాలను వదిలేసి ...విద్యుత్ ఉన్న గ్రామస్థులతో మాట్లాడడంలోనే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని గిరిజన సంఘం నాయకులు విమర్శిస్తున్నారు.

“అల్లూరి సీతారామరాజు జిల్లాలో 70 గ్రామాల్లోఇప్పటికీ కరెంట్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎంపీలు, ఎమ్మేల్యేలు ఈ గ్రామాల మీద దృష్టి పెట్టి విద్యుత్ సౌకర్యం కల్పించాలి. అవి కాకుండా విద్యుత్ ఉన్న గిరిజన గ్రామస్థులతో మాట్లాడి, దానిని ప్రచారం చేసుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. చూస్తున్నారు కదా...బూరుగు వంటి గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక గిరిజనులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో?” అని గిరిజన సంఘం నేత గోవిందరావు ప్రశ్నించారు.

అల్లూరి జిల్లాలో షెడ్యూల్డ్ ఏరియాలో 35 గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

“నేను స్వయంగా చూశాను, తర్వలోనే పరిష్కారం: పీవో

బూరుగు గ్రామంలోని విద్యుత్ సౌకర్యం లేకపోవడం, అక్కడి గిరిజనులు పడుతున్న అవస్థలను పాడేరు ఆయన దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది.

“గతంలో రోడ్లు, విద్యుత్ సౌకర్యం లేని దాయర్తి, పినకోట వంటి గ్రామాలపై బీబీసీ చేసిన కథనాలు, స్థానికుల విన్నపాల నేపథ్యంలో అక్కడ రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాం. ఇప్పుడు మీరు చెప్పిన బూరుగు గ్రామాన్ని నేను సందర్శించాను. అక్కడ సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశాం. కానీ అది పూర్తిగా పాడైపోయింది. ఏజెన్సీలో 35 గ్రామాలకు పూర్తిగా కరెంట్ లేదు. ఈ 35 గ్రామాల విద్యుత్ కోసం 4 కోట్ల 76 లక్షల రూపాయలు కావాలని గవర్నమెంటుకు లేఖ రాశాం. నిధులు రాగానే పనులు మొదలు పెడతాం. ప్రస్తుతం 'మిషన్ కనెక్ట్ పాడేరు’ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్త్ లైన్లు వేస్తాం” అని పీవో రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Boorugu: 12 hours a day in those tribal villages!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X