Breaking : ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు-వరుసగా మూడోరోజూ..
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామకంలో వ్యవహరిస్తున్న తీరుపై రెండు రోజులుగా నిప్పులు చెరుగుతున్న సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి అదే స్ధాయిలో స్పందించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను మెరుపు వేగంతో నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ల స్వతంత్ర ప్రతిపత్తిపై విచారణ జరుపుతున్న ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా మూడవ రోజు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను తమముందు ఉంచాలని నిన్న ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేంద్రం ఇవాళ సదరు ఫైళ్లను సుప్రీంకోర్టుకు అందించింది.

ఎన్నికల కమిషనర్ నియామకం కోసం షార్ట్ లిస్ట్ చేసిన నలుగురిలో ఒకరిని న్యాయమంత్రి ఎంపిక చేస్తారని, కానీ ఈ నెల 18న అరుణ్ గోయల్ పేరుపై ప్రతిపాదన రాగానే అదే రోజు కేంద్రం ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మంత్రి సైతం అదే రోజు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడాన్నీ తప్పుబట్టింది. తాము కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదని, కానీ ఇదంతా తప్పని అనిపించడం లేదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ సందర్భంగా తాము అరుణ్ గోయల్ అర్హతల గురించి ప్రశ్నించడం లేదని, కేవలం ఆయన నియామకం జరిగిన తీరుపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత కేసులు తీసుకోవడం సరికాదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిన్న విచారణ సందర్భంగా అవసరమైతే ప్రధానిపై సైతం చర్యలు తీసుకునే ఎన్నికల కమిషనర్లు ఉండాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications