వరుడికి ఎయిడ్స్: ఫ్లెక్సీతో పెళ్లాగిపోయింది
తిరువణ్ణామలై (తమిళనాడు): పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఓ యువతి జీవితాన్నికాపాడింది. సరైన సమయంలో అధికారులు పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అసలు విషయం చెప్పడంతో అందరూ షాక్ కు గురైనారు.
వరుడికి (30) హెచ్ఐవీ (ఎయిడ్స్) ఉందని వెలుగు చూసింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం పట్టణంలో ఓ జంట వివాహానికి అన్ని సిద్దం చేశారు. శుభకార్యం జరుగుతున్న కళ్యాణమంటపం దగ్గర వరుడు, వధువు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అటు వైపు వెలుతున్న ఓ వ్యక్తి వరుడి ఫోటో చూసి వెంటనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి పళనిలకు ఫోన్ చేశాడు. వరుడికి ఎయిడ్స్ ఉందని, ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స చేయించుకుంటున్నాడని చెప్పాడు.

రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీ, మెడికల్ జాయింట్ డైరెక్టర్ కు ఫోన్ చేసి వరుడికి ఎయిడ్స్ ఉందా ? లేదా? కనుక్కోవాలని సూచించారు. అదేవిధంగా వధువు చిరునామా కనుక్కోవాలని చెప్పారు.
2014 జులై 30 నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ నివారణకు వరుడు చికిత్స చేయించుకుంటున్నాడని అధికారులు గుర్తించారు. అర్దరాత్రి 1.30 గంటల సమయంలో తహసిల్దార్ కామరాజ్ వరుడికి ఫోన్ చేశారు.
తాను వచ్చి కలుస్తానని వరుడు తహసిల్దార్ కు చెప్పాడు. అయితే అతను రాకపోవడంతో తహసిల్దార్ కామరాజ్, వైద్యాధికారి సెంథిల్ కుమార్, చెంగం పట్టణం పోలీసు అధికారులు వధువు కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు.
మొదట వధువు కుటుంబ సభ్యులు నమ్మలేదు. చివరికి వైద్య పరిక్షలు చేసిన పత్రాలు చూసిన తరువాత వధువు తాను పెళ్లి చేసుకోనని చెప్పింది. అమ్మాయి జీవితం కాపాడినందుకు వధువు కుటుంబ సభ్యులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
పోలీసులు భద్రత కల్పించడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు సొంత గ్రామానికి చేరుకున్నారు. అదే గ్రామంలో నివాసం ఉంటున్న మరో యువకుడితో యువతికి పెళ్లి జరిపించారు. 7 గంటల పాటు కష్టపడినందుకు ఓ యువతి జీవితం కాపాడామని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications