బెంగళూరు ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. ఆగస్టు 22వ తేదిన బీబీఎంపీ ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం బెంగళూరు నగర ఎన్నికల అధికారి, బీబీఎంపీ కమిషనర్ జి. కుమార్ నాయక్ తెలిపారు.
బీబీఎంపీ పరిధిలో నివాసం ఉంటూ ఎన్నికల గుర్తింపు కార్డు (ఓటరు కార్డు) లేని వారు ఆగస్టు 10వ తేది వరకు బీబీఎంపీ వార్డు పాలికె కార్యాలయాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన మనవి చేశారు. జులై 17వ తేది నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు.
ఆగస్టు 26వ తేది వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గుర్తు చేశారు. ఆగస్టు 22వ తేది శనివారం పోలింగ్ జరుగుతుందని, ఆగస్టు 25వ తేదిన ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. బీబీఎంపీ పరిధిలోని 198 వార్డులలో 71.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.

మొత్తం 6,733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు వెంటనే వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని జి. కుమార్ నాయక్ తెలిపారు. ఆగస్టు 10వ తేది నామినేషన్ వెయ్యడానికి చివరి రోజు.
ఆగస్టు 13వ తేదిన నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది, ఆగస్టు 22వ తేదిన పోలింగ్ ఉంటుందని, అవసరం అయితే ఆగస్టు 24వ తేది రీ పోలింగ్ నిర్వహిస్తామని, ఆగస్టు 25వ తేదిన ఫలితాలు వెల్లడిస్తామని కుమార్ నాయక్ వివరించారు.












Click it and Unblock the Notifications