• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ కేబినెట్: 9 మంది కొత్త మంత్రుల గురించి తెలుసుకోండి

|
  Modi Cabinet Reshuffle 2017 : All About 9 New Ministers And Their Portfolios | Oneindia Telugu

  న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించారు. కొత్తగా తొమ్మిది మందిని తీసుకున్నారు. మరో నలుగురు సీనియర్‌ మంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించారు.

  ఆదివారం ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

  తెలుగువారికి మోడీ ఝలక్: కేబినెట్లోకి నేనా.. ఓ నేత షాక్, కొత్త మంత్రుల ప్రమాణం.. వీరే

  అశ్విని కుమార్‌ చౌబే, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, శివ ప్రతాప్‌ శుక్లా, హర్దీప్ సింగ్ పూరి, సత్యపాల్ సింగ్‌, రాజ్‌కుమార్ సింగ్‌, అల్ఫోన్స్‌ అల్ఫోన్స్ కన్నంతనం, వీరేంద్రకుమార్‌, అనంత్ కుమార్‌ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  అలాగే ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులు నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్విలకు కేబినెట్‌ హోదా కల్పించారు.

  రాజ్ కుమార్ సింగ్

  రాజ్ కుమార్ సింగ్

  రాజ్ కుమార్ సింగ్ 1975వ బ్యాచ్‌ బీహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం బీహార్‌లోని ఆరా లోకసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యం, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, న్యాయశాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శిగానూ పని చేశారు. బీహార్‌ ప్రభుత్వంలో ఉండగా హోం, పరిశ్రమలు, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల్లో సేవలందించారు. పోలీసులు, జైళ్ల ఆధునీకరణలో మంచి అనుభవం ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఒక ప్రణాళిక రూపొందించారు. ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడయ్యాక లా చదివారు. నెదర్లాండ్స్‌లోని ఆర్వీబీడెల్ట్ఫ్‌ యూనివర్శిటీలో చదువుకున్నారు.

  హర్దీప్ సింగ్ పూరీ

  హర్దీప్ సింగ్ పూరీ

  హర్దీప్ సింగ్ పూరీ 1974 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏ సభకు ప్రాతినిథ్యం వహించడంలేదు. విదేశీ విధానాలు, జాతీయ భద్రత అంశాల్లో పూర్తిస్థాయి అనుభవం, నైపుణ్యం ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిశోధన-సమాచార వ్యవస్థ (ఆర్‌ఐఎస్‌)కు ఛైర్మన్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. దౌత్య రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. బ్రెజిల్‌, యూకే, ఐరాసలో రాయబారిగా పని చేశారు. జెనీవాలో భారత్‌ తరఫున శాశ్వత సభ్యుడిగా సేవలందించారు. భద్రతా మండలికి భారత్‌ తరఫున వెళ్లిన బృందానికి నేతృత్వం వహించారు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి, భద్రత మండలికి ఛైర్మన్‌గా పని చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలోని హిందూ కళాశాలలో చదివారు. జేపీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక కాకముందు ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలో కొంతకాలం చదువు చెప్పారు.

  సత్యపాల్ సింగ్

  సత్యపాల్ సింగ్

  సత్యపాల్ సింగ్ యూపీ లోకసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హోంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా పని చేస్తున్నారు. ఆయన 1980వ బ్యాచ్‌ మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. 1990లో ఏపీ, మధ్యప్రదేశ్‌లోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పని చేశారు. గిరిజనుల సమస్యలు, మావోయిస్టుల ఉద్యమంపై పుస్తకం రాశారు. ఎమ్మెస్సీ, ఎంఫిల్‌ చేశారు. స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో ఆస్ట్రేలియా నుంచి ఎంబీఏ, ప్రజా పరిపాలనలో ఎంఏ, నక్సలిజంపై పీహెచ్‌డీ చేశారు.

  గడ్చిరౌలి, నాసిక్, బుల్దానా జిల్లాలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పని చేశారు. నాగపూర్ రేంజ్ ఐజీగా పని చేశారు. ముంబై (క్రైమ్) జాయింట్ కమిషనర్ ఆఫీస్ పోలీస్‌గా పని చేశారు. నాగపూర్, పుణేలలో పోలీస్ కమిషనర్‌గా, ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేశారు.

  అల్ఫోన్స్ కన్సాంతం

  అల్ఫోన్స్ కన్సాంతం

  అల్ఫోన్స్ 1979 బ్యాచ్‌, కేరళ కేడర్‌ ఐఎఎస్‌ అధికారి. లాయర్. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆక్రమణ కూల్చివేతలు చేపట్టి ఢిల్లీ డెమాలిషన్‌ మ్యాన్‌‌గా పేరొందారు. వేలాది అక్రమ భవనాలను కూల్చివేయించారు. 1994లో టైమ్‌ మేగజైన్‌ ప్రచురించిన 100 మంది ప్రపంచ యువ నేతల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కొట్టాయం జిల్లాలో విద్యుత్తు సౌకర్యం లేని మనిమాల గ్రామంలో జన్మించారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు 1989లో కొట్టాయంను 100% అక్షరాస్యత పట్టణంగా నిలిపారు. 1994లో జన్‌శక్తి ఎన్‌జీవో ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా పనిచేసేలా పోరాడారు. 2006, 2011ల్లో కేరళలోని కంజిరాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017 విద్యా విధానం రూపకల్పన కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. మేకింగ్‌ ఏ డిఫరెన్స్ పేరుతో పుస్తకం రాశారు.

  అశ్విన్ కుమార్ చౌబే

  అశ్విన్ కుమార్ చౌబే

  అశ్విన్ కుమార్ చౌబే బీహార్‌లోని బక్సర్‌ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంటు అంచనాల కమిటీలో, ఇంధన కమిటీ స్థాయీ సంఘంలో, కేంద్ర సిల్క్‌ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బీహార్‌ అసెంబ్లీకి వరుసగా అయిదుసార్లు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో వైద్యం, పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్‌ మంత్రిగా ఎనిమిదేళ్లపాటు సేవలందించారు. పట్నా యూనివర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా విజయం సాధించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1970లో జేపీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. 'ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, అప్పుడే ఆడపిల్లల కన్యాదానం' అనే నినాదం ఇచ్చారు. మహా దళిత్‌ కుటుంబాలకు 11 వేల మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. 2013లో కేదార్‌నాథ్‌ ప్రకృతి విలయాన్ని కుటుంబంతో సహా ప్రత్యక్షంగా చూశారు. ఆ విపత్తుపై పుస్తకం రాశారు. బీఎస్సీ చదివారు.

  అనంత్ కుమార్ హెగ్డె

  అనంత్ కుమార్ హెగ్డె

  అనంత్ కుమార్ హెగ్డే కర్నాటకలోని ఉత్తర కన్నడ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం 5వసారి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్థిక, హోం, మానవ వనరులు, వాణిజ్యం, వ్యవసాయ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుడిగా సేవలందించారు. సుగంధ ద్రవ్యాల మండలి సభ్యుడిగా నాలుగుసార్లు పని చేశారు. గ్రామీణ భారతంపై మంచి అవగాహన ఉంది. గ్రామీణాభివృద్ధి కోసం కదంబ అనే ఎన్జీవోను స్థాపించారు. తైక్వాండో, కొరియా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది.

  గజేంద్ర సింగ్ షేఖావత్

  గజేంద్ర సింగ్ షేఖావత్

  రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నుంచి గజేంద్ర సింగ్ షేఖావత్ లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తనను కేబినెట్లోకి తీసుకున్నందుకు ఈయన మోడీకి థ్యాంక్స్ చెప్పారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. ఫెలోషిప్‌ కమిటీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉంది. ప్రగతిశీల రైతు. సాధారణ జీవనశైలికి నిదర్శనం. సామాజిక సేవలో మంచి పేరుంది. క్రీడాభిమాని. జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. జోధ్‌పూర్‌లోని జైనారాయణ వ్యాస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్‌ చేశారు.

  శివప్రతాప్ శుక్లా

  శివప్రతాప్ శుక్లా

  శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు యూపీ శాసన సభ్యునిగా ఉన్నారు. ఎనిమిది ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల సంస్కరణల్లో మంచి అనుభవం ఉంది. గోరఖ్‌పూర్‌ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదివారు. 1970ల్లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలపాటు జైలుకు వెళ్లివచ్చారు.

  వీరేంద్ర కుమార్

  వీరేంద్ర కుమార్

  వీరేంద్ర కుమార్ మధ్యప్రదేశ్‌లోని టికంఘా లోకసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆరుసార్లు లోకసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా ఉన్నారు. లాభదాయక పదవుల వివాదంలో సంయుక్త సంఘానికి ఛైర్మన్‌గా పని చేశారు. జాతీయ సామాజిక భద్రత మండలి సభ్యుడిగా సేవలందించారు. ఎస్సీ, ఎస్టీ, కార్మిక సంక్షేమశాఖ, హక్కుల సంఘం, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా పనిచేశారు. ఈయన కూడా 70వ దశకంలో జేపీ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలుకెళ్లారు. ఎస్సీల జీవన స్థితిగతుల మెరుగుకోసం జీవితాన్ని అంకితం చేశారు. ఎంఏ చదివారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After days of speculations and multiple rounds of meetings, it became clear on Saturday evening that nine new ministers would be inducted into the Prime Minister Narendra Modi's cabinet on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more