వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవతార్ చిత్రీకరణకు వాడిన 'మోషన్ క్యాప్చర్' టెక్నాలజీతో కొన్ని వ్యాధులను ముందుగానే కనుక్కోవచ్చా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోషన్ క్యాప్చర్

''మోషన్ క్యాప్చర్ సూట్స్’’ టెక్నాలజీ అవతార్‌ సినిమాలో పాత్రలకు జీవం పోసింది. అయితే, కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాన్ని ముందే కనిపెట్టడంలోనూ ఈ టెక్నాలజీ సాయం చేస్తోంది.

మన కదలికలను ప్రభావితంచేసే వ్యాధులను తొలి దశల్లోనే గుర్తిస్తే, వీటి నుంచి తగిన చికిత్సలు తీసుకోవడం ద్వారా కోలుకునే అవకాశం ఉంటుంది.

మన శరీర కదలికలను విశ్లేషించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగిస్తోంది.

ఈ టెక్నాలజీ సాయంతో రెండు జన్యుపరమైన వ్యాధులను తీవ్రతను అత్యుత్తమ వైద్యుల కంటే రెండు రెట్ల వేగంతో బ్రిటన్ నిపుణులు గుర్తించగలిగారు.

క్లినికల్ ట్రయల్స్‌లో కొత్త ఔషధాల అభివృద్ధికి అవసరమయ్యే ఖర్చును కూడా ఈ టెక్నాలజీతో సగానికి తగ్గించే అవకాశముంది. దీనికి సంబంధించిన పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ మెడిసిన్‌లో ప్రచురితం అయ్యాయి.

మోషన్ క్యాప్చర్

ఈ పరిశోధన ఫలితాలను చూసి ఆశ్చర్యపోయానని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్‌కు చెందిన డాక్టర్ వలేరియా రికొట్టి బీబీసీతో చెప్పారు.

''వ్యాధుల నిర్ధారణతోపాటు కొత్త ఔషధాల అభివృద్ధిలో ఈ టెక్నాలజీ కీలకపాత్ర పోషించే అవకాశముంది’’అని రికొట్టి చెప్పారు.

కొత్త టెక్నాలజీ కోసం గత పదేళ్లుగా పనిచేస్తున్న ఇంపీరియల్ కాలేజీ అండ్ యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకుల బృందంలో రికొట్టి కూడా ఉన్నారు.

ఫ్రీడ్రిక్స్ అటాక్సియా (ఎఫ్ఏ), డ్యుషెన్న్ మస్క్యులర్ డిస్ట్రఫీ (డీఎండీ) బాధితులపై ఈ టెక్నాలజీని పరిశోధకులు పరీక్షించి చూశారు. శరీర కదలిలకను ప్రభావితం చేసే ఇతర వ్యాధుల నుంచి రోగులు ఎలా కోలుకుంటున్నారో తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంటే మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలతోపాటు కొన్ని మానసిక రుగ్మతల విషయంలోనూ ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశముంది.

మోషన్ క్యాప్చర్

సాధారణంగా వ్యాధి తీవ్రత ఎలా ఉందో పర్యవేక్షించడం, ప్రస్తుత పరిస్థితిని ట్రాక్ చేయడం లాంటి అంశాలను పరిశీలించేందుకు రోగులకు క్లినిక్‌లలో కొన్ని కదలికల పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఒక్కోసారి పరీక్షలు నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ఏళ్లు గడుస్తున్నా, రోగుల పరిస్థితిని అంచనా వేయడం ఇబ్బంది అవుతుంది.

అయితే, తాజాగా ప్రచురితమైన అధ్యయనంలో మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌తో చాలా వేగంగా రోగుల స్థితిగతులను పరిశోధకులు అంచనా వేయగలిగారు. అవతార్ లాంటి సినిమాల్లో నటుల కదలికలు ఏలియన్లలా చూపించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

తాజా టెక్నాలజీతో సమస్యలను తొలి దశలోనే గుర్తించడంతోపాటు మెరుగ్గా ట్రాక్ చేయొచ్చని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ అల్డో ఫైసల్ చెప్పారు.

''మనుషులు గుర్తించలేని చిన్న కదలికలను కూడా ఈ టెక్నాలజీతో మనం గుర్తించొచ్చు. దీంతో మనం తొలి దశల్లోనే వ్యాధులను గుర్తించొచ్చు. రోగుల స్థితిగతులను మెరుగ్గా పర్యవేక్షించొచ్చు. క్లినికల్ ట్రయల్స్‌లోనూ దీనితో విప్లవాత్మక మార్పులు వస్తాయి’’అని ఆయన చెప్పారు.

ఫ్రీడ్రిక్స్ అటాక్సియా (ఎఫ్ఏ) రుగ్మత ప్రతి 50,000 మందిలో ఒకరిని, డ్యుషెన్న్ మస్క్యులర్ డిస్ట్రఫీ (డీఎండీ) ప్రతి 20,000 మంది ఒకరిని పీడిస్తోంది. వీటిని నయంచేసే చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

మొదటగా ఎఫ్ఏ బాధితులపై ఈ టెక్నాలజీని ఇంపీరియల్ కాలేజీ నిపుణులు పరీక్షించారు. దీంతో ఈ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఏమైనా ఉందా? అనే విషయాన్ని 12 నెలల్లోనే ఈ టెక్నాలజీ కనిపెడుతోంది. అదే వైద్యులు దీన్ని నిర్ధారించేందుకు దాదాపు 24 నెలల సమయం పడుతోంది.

మరోవైపు గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఈ టెక్నాలజీని ఐదు నుంచి 18 ఏళ్ల వయసున్న 21 మంది డీఎండీ బాధిత బాలురపై పరీక్షించింది. వచ్చే ఆరు నెలల్లో వీరికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశముందో వైద్యుల కంటే మెరుగ్గా ఇది అంచనా వేయగలిగింది.

క్లినికల్ ట్రయల్స్ ఖర్చు తగ్గించేందుకు, కొత్త ఔషధ సమ్మేళనాల పరీక్షలకు ఇది ఉపయోగపడే అవకాశముందని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

''ఎక్కువ ఔషధాలను తక్కువ మందిపై వేగంగా, తక్కువ ఖర్చుతో పరీక్షించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది’’అని ప్రొఫెసర్ పాలా జింటి చెప్పారు.

సాధారణంగా కొత్త ఔషధం కోసం దాదాపు వంద మందిపై 18 నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం 15 మందితో ఆరు నెలల్లోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయడానికి ఇది బాటలు పరుస్తోంది.

విప్లవాత్మక మార్పులు..

కొత్త టెక్నాలజీతో ఔషధాల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ ఫెస్టెన్‌స్టీన్ చెప్పారు.

''దీని వల్ల అరుదైన వ్యాధులపై చికిత్సలపైనా ఫార్మా సంస్థలు దృష్టి పెడతాయి’’అని ఆయన వివరించారు.

''ఈ పరిశోధనల వల్ల అంతిమంగా రోగులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే కొత్త ఔషధాలను తక్కువ కాలంలోనే కనిపెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది’’అని ఆయన అన్నారు.

ఎఫ్ఏ, డీఎండీ ట్రయల్స్‌లో మోషన్ పిక్చర్ టెక్నాలజీని ఉపయోగించేందుకు అనుమతించాలని పరిశోధకులు బ్రిటన్ ఔషధ ప్రాధికార సంస్థను కోరారు. అనుమతులు వస్తే, రెండేళ్లలోనే పూర్తిస్థాయి ట్రయల్స్ మొదలయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Can some diseases be detected early with the 'motion capture' technology used to film Avatar?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X