శారదా ట్విస్ట్: మంత్రి అరెస్ట్, మర్యాద కోసమే.. బీజేపీపై మమత ఫైర్
కోల్‌కతా: శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి మదన్ మిత్రాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై కుట్ర, మోసం అభియోగాలు నమోదు చేశారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఈయనను సీబీఐ శుక్రవారం విచారించంది. ఇతను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక నేత. నవంబర్ నెలలో సీబీఐ అతనికి శారదా చిట్ ఫండ్ కేసులో సమన్లు జారీ చేసింది. అప్పటి నుండి అతను ఆసుపత్రిలో ఉన్నారు.

తనకు ఆరోగ్యం బాగా లేదని, కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలని అతను విజ్ఞప్తి చేశారు. అనంతరం శుక్రవారం అతను సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాల్ట్ లేక్ ఏరియాలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న సీబీఐ కార్యాలయంలోకి వెళ్లే ముందు అతను విలేకరులతో మాట్లాడలేదు.

సమాచారం మేరకు.. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ అతనిని విచారించినట్లుగా తెలుస్తోంది. గతంలో మిత్రా మాజీ సహాయకుడైన బాపి కరీంను సీబీఐ ప్రశ్నించింది. శుక్రవారం మిత్రాను ప్రశ్నించిన సీబీఐ అతనిని అరెస్టు చేసింది. శారదాలో అతని పాత్ర పైన సీబీఐ ప్రశఅనించినట్లుగా తెలుస్తోంది.
నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ

మిత్రా అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పైన సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. అరెస్టు కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమన్నారు. ఇన్నాళ్లు మర్యాద కోసమే తాను ఓపిక వహించానని, మంత్రి మిత్రా అరెస్టు చట్ట విరుద్ధమన్నారు. తాము సీపీఎం నేతల పైన ఎప్పుడు రాజకీయ కక్షలకు పాల్పడలేదన్నారు. వారిని అరెస్టు చేయలేదన్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు. వామపక్ష నేతలను కేంద్రం ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ గూండాగిరికి పాల్పడుతోందన్నారు.












Click it and Unblock the Notifications