Maharastra Polls: మహారాష్ట్ర ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు-మధ్య రైల్వే కీలక ప్రకటన..!
మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను భారీగా పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని పలు విభాగాలతో పాటు కేంద్రం సాయం కూడా తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న రవాణా సౌకర్యాలకు అదనంగా మరికొన్నింటిని జోడించడం ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించబోతోంది.
రేపు జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మధ్య రైల్వే.. ఎన్నికల అధికారులు, సిబ్బంది, ప్రజల కోసం ప్రత్యేక సబర్బన్ రైలు సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అదనపు సేవలు నవంబర్ 19-20 మరియు నవంబర్ 20-21 రాత్రులలో అందుబాటులో ఉంటాయి. ప్రధాన సబర్బన్ రూట్లలో మెయిన్ లైన్ (సీఎస్ఎంటీ-కళ్యాణ్), హార్బర్ లైన్ (సీఎస్ఎంటీ-పన్వెల్)లో నడుస్తాయని అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్లు ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లకు రేపు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మహాయుతి కూటమితో మహా వికాస్ అఘాడీ కూటమి తలపడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications