Myanmar Border Fence: మయన్మార్ సరిహద్దుల్లో కంచె ! కేంద్రం సంచలన నిర్ణయం..!
భారత్ కు పొరుగున ఉన్న మయన్మార్ లో అంతర్గత సంక్షోభం ఇప్పుడు మనకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా అక్కడ సైన్యానికీ, ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న పోరులో పారిపోయి వస్తున్న సైనికుల వలసలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. మయన్మార్ సరిహద్దుల్లో కంచె నిర్మించాలని నిర్ణయించింది. అసోం పోలీసు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా ఈ ప్రకటన చేశారు.
మయన్మార్ లో వర్గాల పోరు నానాటికీ తీవ్రమవుతోంది. దీన్నుంచి తప్పించుకునేందుకు భారత్ లోకి వారి సైనికులు వలస వచ్చేస్తున్నారు. వీరి రాక వల్ల భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుల తరహాలోనే మయన్మార్ సరిహద్దుల్లోనూ కంచె వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల్లో 600 మంది మయన్మార్ సైనికులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వీరిని మిజోరంలో ఉన్న వలస క్యాంపులకు పంపారు.

ఇప్పటివరకూ మయన్మార్ నుంచి భారత్ లోకి ఎలాంటి వీసాల్లేకుండానే అక్కడి పౌరులు వచ్చేస్తున్నారు. కానీ ఇకపై కంచె వేయడంతో పాటు వీసా నిబంధనల్ని అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల వారు సైతం వీసా ఉంటేనే భారత్ లోకి ప్రవేశించేందుకు వీలుంటుంది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న పౌరుల్ని దృష్టిలో ఉంచుకుని ఇరుదేశాల మధ్య 1970లో స్వేచ్ఛా ప్రయాణ అవకాశం కల్పించారు. దాన్ని కేంద్రం ఇప్పుడు రద్దు చేయబోతోంది.
ఇప్పటికే మయన్మార్ నుంచి వచ్చిన సైనికుల్ని కూడా వెనక్కి పంపాలని కేంద్రాన్ని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications