Messenger Apps block : ఈ 14 మెసెంజర్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్రం..కారణమిదే..
కేంద్రం ఇవాళ మొబైల్ యాప్స్ పై మరోసారి కొరడా ఝళిపించింది. ఏకంగా 14 మొబైల్ యాప్స్ ను నిషేధించింది. అంతే కాదు వీటిని బ్లాక్ కూడా చేసేసింది. ఇవన్నీ మొబైల్ మెసెంజర్ యాప్స్ కావడం విశేషం. వీటిని బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. దీని వెనుక ఉన్న బలమైన కారణాన్ని కూడా వెల్లడించింది. దీంతో ఆయా యాప్స్ ఇప్పుడు మీ మొబైల్స్ లో అందుబాటులో లేకుండా పోయాయి.
దేశవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాల అణిచివేతలో భాగంగా కేంద్రం ఇవాళ 14 మొబైల్ మెసెంజర్ యాప్స్ ను బ్లాక్ చేసింది. ఆయా యాప్స్ ద్వారా దేశంలో తీవ్రవాద ప్రచారం, కమ్యూనికేషన్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఈ నెట్ వర్క్ ను బ్రేక్ చేయడానికి సదరు యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్లాక్ అయిన వాటిలో Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second Line, Zangi, Threema ఉన్నాయి.

తీవ్రవాదులు ఆయా మెసెంజర్ యాప్ ల్లో తమ మద్దతుదారులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లతో సమాచారం పంచుకోవడానికి, సూచనలను స్వీకరించడానికి వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్‌లను కేంద్రం నిషేధించింది. పాకిస్తాన్ నుండి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలో భద్రతా, నిఘా సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే భారత చట్టాలను పాటించని యాప్‌ల జాబితాను భద్రతా సంస్ధలు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాయి. దీంతో వాటిని నిషేధించాలన్న సూచనను కేంద్రం ఆమోదించింది. ఈ యాప్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications