DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త-4 శాతం డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్..!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ఇచ్చే కరువు భత్యాన్ని 4 శాతం పెంచాలని నిర్ణయించించింది. ఈ మేరకు 4 శాతం పెంపుకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల కరవు భత్యం మొత్తం 46 శాతానికి చేరుకోనుంది. పండుగ వేళ కేంద్రం డీఏ పెంపు శాతంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ కానుకగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42 శాతంగా ఉంది. దీన్ని ఇప్పుడు నాలుగు శాతం పెంచడంతో మొత్తం 46 శాతానికి చేరబోతోంది. తాజా పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరబోతోంది. కేంద్రం ప్రతీ ఏటా రెండుసార్లు ఉద్యోగులకు డీఏ పెంపు ప్రయోజనం అందిస్తుంది. అప్పటి ధరల సూచీ ఆధారంగా కరవు భత్యాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుత పరిస్ధితుల్ని బట్టి 3 శాతం ఇస్తారని భావించినా, ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం దీన్ని 4 శాతానికి పెంచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ఉద్యోగులు డీఏ పెంపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. 7వ వేతన సంఘం కూడా కేంద్ర ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపుకు అంగీకరించడంతో కేంద్రం ఇవాళ ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం త్వరలో డీఏ పెంపు అమల్లోకి వస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది. ముఖ్యంగా ఎన్నికలు జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఉద్యోగుల విషయంలో పన్ను మినహాయింపులు ఆశించినంతగా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రం.. ఎన్నికల వేళ డీఏ శాతం పెంపు ద్వారా వారికి ఊరటనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం, ఆ తర్వాత వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.












Click it and Unblock the Notifications