రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ ? మాతోనే ఆటలా ? గవాయ్ ఫైర్..!
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కు ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలైన ఓ కీలక పిటిషన్ విషయంలో చేసిన ఓ విజ్ఞప్తి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సుప్రీంకోర్టుతో ఆటలాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ తాజాగా కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. అయితే ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. తీర్పు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

పిటిషనర్ల వాదనలు ముగిసిన తర్వాతే కేంద్రం ఈ అభ్యర్థన చేయడం దిగ్భ్రాంతికరంగా ఉందని సీజేఐ తెలిపారు. ఇది తమ ధర్మాసనాన్ని తప్పించుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తమపై వ్యూహాలు పన్నుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ చేసిన విచారణకు ముందు అర్ధరాత్రి ఇలా విజ్ఞప్తి చేయడం కూడా సరికాదని సీజేఐ తెలిపారు.
అయితే ఈ పిటిషన్లపై రాజ్యాంగ పరమైన ప్రశ్నలు తలెత్తడంతోనే తాము ఇలా చేయాల్సి వచ్చిందని అటార్నీ జనరల్ వెంకటరమణి వివరించారు. అయితే పిటిషనర్ల పూర్తి విచారణ తర్వాత ఈ పిటిషన్ ఆమోదయోగ్యం కాదని బెంచ్ తెలిపింది.

చివరికి కేంద్రం చేసిన అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకుని, నిజంగా ఈ పిటిషన్లపై విచారణ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉంటే, కోర్టు స్వయంగా తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని సీజేఐ గవాయ్ తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణలను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సీజేఐ గవాయ్ పదవీ విరమణ చేసే ముందే ఈ వ్యవహారంపై తీర్పు ఇచ్చేయాలా లేక రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా అన్నది నిర్ణయించనున్నారు.












Click it and Unblock the Notifications