మంచుతో విమానాల ఆలస్యం-ప్రయాణికుల దాడులు- కేంద్రం ఆగ్రహం..!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చలికాలం సాధారణంగా మంచు ప్రభావం ఉండేదే అయినా ఈసారి కాస్త ఎక్కువగా ఉండటంతో పలు చోట్ల విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ విమాన ప్రయాణం చేసేదే సమయం ఆదా చేసుకునేందుకు కావడంతో ఈ ఆలస్యాలతో పలు చోట్ల ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. ఈ అసహనం కాస్తా ఇవాళ ఇండియా విమాన పైలట్ పై ప్రయాణికుడు దాడి చేసే వరకూ వెళ్లింది. దీనిపై కేంద్రం సీరియస్ అయింది.
విమాన ప్రయాణాలు మంచు కారణంగా ఆలస్యం అవుతున్నాయన్నది వాస్తవమేనని, ప్రయాణికులు కూడా వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ సూచించారు. వాస్తవాన్ని గుర్తించకుండా పైలట్, ఇతర విమాన సిబ్బందిపై దాడులకు దిగడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు. ఇలాంటి దాడుల్ని ఎట్టి పరిస్దితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎక్స్ లో ఇవాళ పెట్టిన పోస్టులో విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో మంచు కారణంగా ఎదురైన పరిస్ధితుల్ని వివరించారు. మంచు కారణంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని విమానాలు నడపాల్సిందిగా కేంద్రమే విమానయాన సంస్ధలకు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిన్న ఉదయం తీవ్ర మంచు కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 150కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం పడటాన్ని ఆయన ప్రస్తావించారు.
ఢిల్లీ నుంచి గోవా వెళ్లే ఇండిగో సర్వీసులో ప్రయాణికుడు అరగంట ఆలస్యమైందన్న కారణంతో ఈ విషయాన్ని వివరిస్తున్న పైలట్ పై దాడికి దిగడాన్ని సింధియా తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ఘటనల్ని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదన్నారు.
ఈ కఠిన సమయంలో కేంద్రానికి సహకరించాలని సింధియా కోరారు.












Click it and Unblock the Notifications