CAA: ఎన్నికలకు ముందే వివాదాస్పద సీఏఏ అమలు-కేంద్రం సంచలన నిర్ణయం..
దేశంలో నివసించేందుకు హక్కున్న పౌరులెవరు, బయటివారెవరో గుర్తించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అదీ పార్లమెంట్ ఎన్నికల లోపే. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ వెల్లడించారు. 2019 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ ని త్వరలో నోటిఫై చేసి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
గతంలో 2019 ఎన్నికల సమయంలో పార్లమెంట్లో అప్పటికే ఉన్న పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. దేశ పౌరులుగా గుర్తించేందుకు కొన్ని ఆధారాలను సమర్పించాలని పౌరులకు నిర్దేశించేలా చట్టాన్ని సవరించారు. ఆ తర్వాత అసోంలో దీని అమలును ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీని అమలుకు ఎన్డీయే సర్కార్ ప్రయత్నించగానే నిరసనలు మొదలయ్యాయి. సీఏఏను వెనక్కి తీసుకోవాలంటే వివిధ రాష్ట్రాల్లో మైనార్టీలు, ఇతర వర్గాలు నినదించారు. పలు చోట్ల నిరసనలు హింసాత్మంగా మారడంతో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బెంగాల్లో బీజేపీ నేతలు హింట్ ఇచ్చేశారు. ఇవాళ అమిత్ షా స్వయంగా ప్రకటన చేయడంతో సీఏఏ అమలు ఖాయమని తేలిపోయింది. సీఏఏని అమలు చేస్తామన్న హామీపై కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని అమిత్ షా ఈ సందర్భంగా ఆరోపించారు. సీఏఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని, దేశం విభజించబడినప్పుడు, ఆ దేశాలలో మైనారిటీలు హింసించబడినప్పుడు, కాంగ్రెస్ శరణార్థులకు భారతదేశంలో స్వాగతం పలుకుతుందని, వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిందని షా పేర్కొన్నారు.
సీఏఏ అనేది పౌరసత్వం కల్పించడానికి తీసుకొస్తున్నామని, ఇది ఎవరి పౌరసత్వాన్ని తీసేయడానికి కాదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మన దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా మన ముస్లిం సమాజాన్ని కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. చట్టంలో ఎవరి పౌరసత్వాన్ని లాక్కునేలా నిబంధనలు లేవన్నారు. సీఏఏ అనేది బంగ్లాదేశ్ , పాకిస్తాన్‌లలో బాధితులుగా మారి భారత్ కు శరణార్థులుగా వస్తున్న వారికి పౌరసత్వాన్ని అందించే చట్టమన్నారు.












Click it and Unblock the Notifications