
చంద్రబాబు నాయుడు-గౌతమ్ సవాంగ్: హెరాయిన్ కేసులో ‘ప్రతిపక్ష నాయకుడికి డీజీపీ లీగల్ నోటీస్.. దేశంలో ఇదే తొలిసారి’ - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైందని, ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై 'న్యాయ అస్త్రాన్ని' ప్రయోగించిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
గుజరాత్‌లో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఏపీకి ముడిపెడుతూ విపక్షాలు దుష్ప్రచారానికి తెగించాయని, ఆ హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు విస్పష్టంగా ప్రకటించినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని తెలిపింది.
దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర పార్టీ నేతలతోపాటు రెండు పత్రికలకు డీజీపీ సవాంగ్ లీగల్ నోటీసులిచ్చినట్లు వెల్లడించింది.
ప్రతిపక్ష నేతతోపాటు మీడియా సంస్థలపై డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఇలా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడం దేశంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుందని సాక్షి పేర్కొంది.
తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలపై బేషరతుగా క్షమాపణలు చెప్పి అదే విషయాన్ని ఆ రెండు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని వివరించింది.
సాధారణంగా సీఎస్, డీజీపీ స్థాయి అధికారులు ఇలా ప్రతిపక్ష నేతకు లీగల్ నోటీసులు జారీ చేయాల్సిన అనివార్యత తలెత్తదని, ఇలా చేయడం దేశంలో ఇదే తొలిసారి అని సాక్షి పేర్కొంది.
- 'ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఠాణాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న సీజేఐ ఎన్వీ రమణ: ప్రెస్ రివ్యూ

పాముతో భార్యను చంపించిన భర్తకు రెండు జీవిత ఖైదులు
రెండో పెండ్లికి అడ్డుగా ఉన్నదని కట్టుకున్న భార్యను పాముకాటుతో చంపిన సూరజ్ ఎస్ కుమార్‌కు కేరళలోని సెషన్స్ కోర్టు బుధవారం రెండు జీవితఖైదులను విధించిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.
అలాగే, బాధితురాలిపై విషప్రయోగం చేసినందుకు, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ దోషికి మరో 17 ఏండ్లు జైలు శిక్షను విధించింది.
దోషి ముందుగా 17 ఏండ్ల జైలుశిక్షను పూర్తిచేసిన తర్వాత రెండు జీవితఖైదులను ఒకేసారి అనుభవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, న్యాయస్థానం తీర్పుతో తాను సంతృప్తిగా లేనని, దోషికి మరణశిక్ష విధించాలని బాధితురాలు ఉత్రా తల్లి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
కేరళలోని కొల్లంకు చెందిన సూరజ్‌కు, ఉత్రాకు రెండేండ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. పెళ్లయ్యాక కొన్నాళ్లు బాగానే ఉన్న సూరజ్.. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి ఉత్రా అడ్డుచెప్పింది.
దీంతో తన చేతులకు మట్టి అంటకుండా ఉత్రాను అడ్డు తొలగించుకోవాలని భావించిన అతను.. గతేడాది మేలో పాములు పట్టే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఓ నాగుపామును తీసుకున్నాడు. నిద్రపోతున్న ఉత్రాపై దాన్ని విసిరేశాడు. పాము రెండుసార్లు కాటువేయడంతో ఉత్రా నిద్రలోనే మరణించింది.
అయితే, ఉన్నట్టుండి ఉత్రా మరణించడం, గతంలో కూడా ఆమెను ఒకసారి పాము కరవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

టమోటా కిలో 72 రూపాయలు
వర్షాలకు టమోటా పంట దెబ్బతినడంతో ధరలు భారీగా పెరిగాయని, మెట్రో నగరాల్లోని రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.72 వరకు ధర పలుకుతోందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఇటీవలి భారీ వర్షాలకు టమోటా ఎక్కువగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పంట చాలా దెబ్బతిన్నది. డిమాండ్ మేరకు మార్కెట్‌కు సరుకు రాకపోవడంతో ధరలు పెరిగాయి.
నెల రోజుల క్రితం కోల్‌కతాలో రూ.38 ధర పలికిన టమోటాను మంగళవారం రూ.72కు అమ్మారు. అంటే నెలలో ధర రెట్టింపు అయింది.
అలాగే ఢిల్లీలో కిలో టమోటా రూ.30 నుంచి రూ.57కు, చెన్నైలో రూ.20 నుంచి రూ.57కు, ముంబైలో రూ.15 నుంచి రూ.53కు పెరిగింది.
పంట నాణ్యత, స్థానికతను బట్టి ధరలు పలుకుతున్నాయి.
ఢిల్లీలోని అజాద్‌పూర్ మండి ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయాల హోల్‌సేల్ మార్కెట్. నెల రోజుల్లో ఇక్కడ టమోటా ధరలు రెట్టింపు కాగా, దిగుమతులు సగానికి తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి టమోటా ఎగుమతి చేస్తున్నారు.
- 'కేజీ టమోటా పాకిస్తాన్లో రూ.300, భారత్‌లో రూ.20’
- నాలుగు ఎకరాల్లో కొత్తిమీర సాగు చేసి.. రూ. 12 లక్షలు సంపాదించిన రైతు
ఏపీలో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మటం అపోహే - నిర్మాత బన్నీ వాసు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మబోతోంది అనేది అపోహ మాత్రమేనని నిర్మాత బన్నీ వాసు చెప్పారని వీ6 వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
నిర్మాతలుగా, ఎగ్జిబిటర్స్‌గా తమ సమస్యలను ఏపీ ప్రభుత్వానికి వివరించామని, దానిపై ప్రభుత్వం కూడా పని చేస్తోందని ఆయన తెలిపారు.
టికెట్ల విక్రయాలను ఆన్‌లైన్ చేస్తే ఎన్ని అమ్మారనే వివరాలు తెలుస్తాయని మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని, ప్రభుత్వమే టికెట్లు అమ్మబోతోందనేది అపోహ మాత్రమేనని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఏం చేసినా సినిమా ఇండస్ట్రీని అడిగే చేస్తోంది తప్ప వన్‌సైడ్‌గా వెళ్లట్లేదని వివరించారు. అయితే, ప్రజల్లో మాత్రం అపోహలు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలపై త్వరలోనే ఓ కమిటీని వేస్తున్నారని బన్నీవాసు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?
- అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉప రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం, ధీటుగా బదులిచ్చిన భారత్
- 'టాటా’కు ఎయిర్ ఇండియా భారమా? లాభదాయక బేరమా
- రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా: ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎందుకంత ప్రత్యేకం
- నాగచైతన్యతో విడాకులు.. సమంతపైనే రూమర్లు, విమర్శలు ఎందుకు? వివాహ బంధాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళదేనా?
- ఇంటర్నెట్ ఎందుకు తరచూ మొరాయిస్తోంది, ఇలా జరక్కుండా ఏం చేయాలి
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- వీర్ సావర్కర్‌కు ఆంగ్లేయులు నెలకు 60 రూపాయల పెన్షన్ ఎందుకు ఇచ్చేవారు? బ్రిటిషర్లతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)