కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కు బెదిరింపు లేఖ.. ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారంటూ..
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు బెదిరింపు లేఖ రావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కరుడు గట్టిన ఉగ్రవాదులు త్వరలోనే మిమ్మల్ని హత్య చేస్తారంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో అప్రమత్తమైన పాశ్వాన్ కార్యాలయం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ బెదిరింపు పోస్టుపై విచారణ జరపాలని.. మంత్రి భద్రతను సమీక్షించాలని ఫిర్యాదులో కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు సీఆర్పీఎఫ్, బిహార్ ప్రభుత్వానికి కూడా సమాచారం పంపింది.
అయితే బెదిరింపు లేఖ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. అయితే లేఖ ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనుక ఎవరు ఉన్నారు..? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ కు ఈ తరహా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఇక ప్రస్తుతం మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు జెడ్ కేటగిరి భద్రత అందుతోంది. ఈ బెదిరింపుపై సమీక్షించిన అనంతరం అవసరమైతే కేంద్రం అదనపు భద్రత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బెదిరింపు లేఖ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ గతంలో చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆయన వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి జతిన్ రామ్ మాంఝీ, ఆయన కుమారుడు, బిహార్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ రాజీనామా చేయాలని పాశ్వాన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బిహార్ లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సమీక్ష, ఉప వర్గీకరణ అంశాలపై ఇప్పటికే రాజకీయంగా వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి ప్రాణాలకు ముప్పు ఉందంటూ సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.












Click it and Unblock the Notifications