"మీరు జెన్ జీ కాదుగా"- కాక్రోక్ నేతలకు హైకోర్టు షాక్- పిటిషన్ ఉపసంహరణ..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నాలు చేయకుండా కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తమకు గతంలో స్థానిక మెజిస్ట్రేట్ విధించిన ఐదు రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత, దాన్ని మరో రెండు రోజుల పాటు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వాస్తవానికి ఇవాళ్టితో మెజిస్ట్రేట్ ఇచ్చిన రెండు రోజుల జ్యూడిషియల్ కస్టడీ గడువు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హడావిడిగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అశుతోష్, సౌరవ్.. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే ఇందుకు నిరాకరించిన హైకోర్టు.. ఇవాళ అత్యవసర విచారణ జరిపేందుకు మాత్రం అంగీకరించింది. దీంతో కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెన్ జీ గా తమను తాము కాక్రోచ్ నేతలు అశుతోష్, సౌరవ్ అభివర్ణించుకోవడాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. మీరు జె న్ జీ కాదుగా అని వారితో వ్యాఖ్యానించింది. ఇద్దరు పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది అభిక్ చిమ్నీ, సౌరవ్ దాస్ వయస్సు 27 ఏళ్లు, అశుతోష్ రాంకా వయస్సు 32 ఏళ్లు అని కోర్టుకు చెప్పగా, కోర్టు, "అయితే మీరు జెన్ జెడ్ కాదు. జెన్ జెడ్ అంటే ఏమిటి?" అని ప్రశ్నించింది.

అనంతరం పిటిషనర్లు మెజిస్ట్రేట్ ఉత్తర్వును రద్దు చేయాలని, తమను తక్షణమే విడుదల చేయాలని, తమ కస్టడీ పొడిగింపుపై స్టే విధించాలని కోరారు. తమను నిర్బంధంలో కొనసాగించడం చట్టవిరుద్ధమని, అది తమ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తోందని వాదించారు. కస్టడీ ఉత్తర్వు నిలవదని లాయర్ అభిక్ వాదించారు. అయితే, ఆ ఉత్తర్వు పునఃపరిశీలనకు అర్హమైనదా, పిటిషనర్లు ముందుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించాలా అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు ఇవాళ మెజిస్ట్రేట్ ముందుకు రావలసి ఉండగా, పిటిషనర్లు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కూడా ప్రశ్నించింది. ఇది పునఃపరిశీలనకు అర్హమైన ఉత్తర్వేనా అని ప్రశ్నించింది. చివరికి పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, మెజిస్ట్రేట్ ముందు జరిగే విచారణల ఫలితం కోసం వేచి ఉండాలని, ఆ తర్వాత తమకు అందుబాటులో ఉన్న మార్గాలను అంచనా వేసుకోవాలని సూచించింది. దీంతో వారు పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.














Click it and Unblock the Notifications
