ఢిల్లీలో సీజేపీ నిరసనవేళ 40మంది నేరచరితులు అరెస్ట్.. 45 మెట్రోస్టేషన్లు బంద్, హై అలెర్ట్!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసన నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునివ్వగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నగరం అంతా హై అలర్ట్‌లో ఉంది.
పోలీసు వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, దిల్లీలోని 15 జిల్లాల పరిధిలో 30 నుంచి 40 మంది నేరచరిత్ర కలిగిన వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల్లో పాల్గొనేలా ప్రజలను ప్రేరేపించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సోషల్ మీడియా ద్వారా జనసమీకరణ చేసే అవకాశమున్న సుమారు 200 మంది కంటెంట్ క్రియేటర్లపై కూడా కన్నేశారు.

మెట్రో సేవలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి నుంచే 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, మండి హౌస్, జనపథ్ వంటి కీలక స్టేషన్లు వీటిలో ఉన్నాయి. న్యూదిల్లీ స్టేషన్ మినహా మిగతా చోట్ల ఇంటర్‌ఛేంజ్ సదుపాయం కొనసాగుతుందని మెట్రో అధికారులు తెలిపారు.
అదనంగా న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల నుంచి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. పోలీసులు నగర సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బస్ స్టాండ్లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ధర్మశాలల్లో సోదాలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేశారు. స్పీకర్ల ద్వారా నిరసనకు అనుమతి లేదు, పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి అని హెచ్చరికలు చేస్తున్నారు.
సీజేపీ నాయకులు అనుమతి లేకపోయినా నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే పోలీసులు 20 వేలకు పైగా సిబ్బందిని మోహరించి, జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన అనేక అంచెలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 12 డిటెన్షన్ సెంటర్లు సిద్ధం చేశారు. సెంట్రల్ దిల్లీలో సెక్షన్ 163 అమల్లో ఉంది. ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. నగరవాసులు అనవసరంగా బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
