బస్సుల్లో ట్రాన్స్‌జెండర్లకూ ఉచిత ప్రయాణం
Lok Sabha elections 2024: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్‌లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్లకూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఢిల్లీ సిటీలో తిరిగే అన్ని రకాల బస్సుల్లోనూ ట్రాన్స్‌జెండర్లు కూడా ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రకటన చేశారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఏ ప్రభుత్వం కూడా ట్రాన్స్‌జెండర్ల కోసం ఎలాంటి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయట్లేదని అన్నారు. ట్రాన్స్‌జెండర్ సమాజం అంటే చిన్న చూపు చూసిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్నామని, అదే తరహాలో ఇక ట్రాన్స్‌జెండర్లు కూడా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేస్తామని వివరించారు. మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.
2019లో ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతీరోజూ సుమారు 14 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లకూ ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తోన్నామని, దీనివల్ల వారికి ఆర్థిక వెసలుబాటు కల్పించినట్టవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications