జాయింట్ పీసీ- సీఎం సీటుపై తేల్చేశారు..!!
Chandrababu: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. మధ్యాహ్నానికి ఈ కూటమి అభ్యర్థులు 73 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో 156 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 10 సీట్లల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 42 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు.కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ఈ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి?, కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న మూడు పార్టీలకూ ఎలాంటి పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలనే విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ భేటీ ముగిసిన తరువాత ఈ ముగ్గురు నేతలూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరాఠా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చారంటూ కితాబిచ్చారు. ప్రజా సేవకు పునరంకితమౌతామని అన్నారు.
ఏక్‌నాథ్ షిండే మట్లాడుతూ- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లే ఈ స్థాయి విజయం సాధ్యపడిందని అన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుటి కూటమిని ఆయనే ముందుండి నడిపించారని, దిశానిర్దేశం చేశారని చెప్పారు. రైతులు, మహిళలు, యువత తమ కూటమికి దిక్సూచిలాంటి వాళ్లని పునరుద్ఘాటించారు.
తమది కామన్ మ్యాన్ ప్రభుత్వమని షిండే వ్యాఖ్యానించారు. తన దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, కామన్ మ్యాన్ అని పేర్కొన్నారు. ప్రతి కామన్ మ్యాన్‌ను సూపర్ మ్యాన్ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సామాన్యుడి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications