సీఎం విజయ్ గ్రేట్ ఇనిషియేటివ్- అపోలో రూ. కోటితో బోణీ
ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థల నుంచి నిధులను సేకరించడానికి నాలమ్ టీఎన్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 139.47 కోట్ల రూపాయల విలువైన వైద్య మౌలిక సదుపాయాలను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ ఉదయం చెన్నైలోని ఓ కాలేజీ వేదికగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగానికి అవసరమైన మానవ వనరుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టారు విజయ్. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పారదర్శకంగా ఎంపికైన 2,144 మంది ఆరోగ్య సిబ్బందికి నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. వీరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ఉద్దేశించిన 751 మంది హెల్త్ ఆఫీసర్లు, క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం, వ్యాధి నియంత్రణ బాధ్యతలను పర్యవేక్షించడానికి మరో 1,393 మంది గ్రేడ్-2 హెల్త్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

తమిళనాడు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నలమ్ టీఎన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను, ఇతర స్వచ్ఛంద విరాళాలను సేకరిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఈ పోర్టల్ ద్వారా నేరుగా తమకు నచ్చిన ఆసుపత్రిని ఎంచుకుని నిధులు అందజేయవచ్చు. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకీకరించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
ఈ పోర్టల్ ప్రారంభించిన మొదటి రోజే అద్భుతమైన స్పందన లభించింది. తొలి విరాళాలుగా అపోలో గ్రూప్ హాస్పిటల్స్, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ చెరో కోటి రూపాయలను సీఎస్ఆర్ కింద అందించాయి. టైటాన్ ఇంజినీరింగ్ సంస్థ రూ. 60 లక్షల విరాళం ప్రకటించింది. వీటితో పాటు, చెన్నైకి చెందిన సత్య అనే మహిళ తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించిన ఉచిత కాన్పు సేవలకు కృతజ్ఞతగా క్యూఆర్ కోడ్ ద్వారా 1,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సమాంతరంగా ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా కీల్పాక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నాలుగు అంతస్తుల రోగుల సేవా విభాగాన్ని ఈ సందర్భంగా విజయ్ ప్రారంభించారు. ఇందులో 30 పడకల ఐసీయూ, 180 పడకల జనరల్ వార్డులు ఉన్నాయి. పరమకుడి, అవధయార్ కోయిల్, నీలకోట్టై, బట్లగుండు, పట్టివీరంపాట్టి, కరియాపట్టి వంటి ప్రాంతాల్లో నిర్మించిన ఆసుపత్రి భవనాలు, 78 నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అంకితం చేశారు.












Click it and Unblock the Notifications