16 ఏళ్ల లోపువారు వద్దు: కోచింగ్ సెంటర్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతోపాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించడం, బోధన విధానాలు మెరుగుపర్చడం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా శిక్షణ కేంద్రాలు(Coaching centres)లకు కీలక సూచనలు చేసింది. అవి ఇలా ఉన్నాయి.. సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు అనుమతించాలి. 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోకూడదు. శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసుండాలి. విద్యార్థుల, తల్లిదండ్రులను తప్పుదోవపట్టించేలా..ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.

సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ గురించిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. కోచింగ్ సెంటర్ లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు ఇవ్వకూడదు.
శిక్షణ ఇచ్చే సంస్థ లేదా వ్యక్తి కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మార్గర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్ లను కూడా రిజిస్ట్రేషన్ చేయాలి.
కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తోపాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.












Click it and Unblock the Notifications