రాజస్తాన్, మధ్యప్రదేశ్ గెలుపుపై కాంగ్రెస్ ధీమా-ఢిల్లీలో అభ్యర్ధుల ఖరారుపై చర్చలు..
కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్తాన్ తో పాటు కొత్తగా మధ్యప్రదేశ్ ను కూడా కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అనుకూలంగా ఉన్న పరిస్ధితుల్ని సొమ్ము చేసుకుంటూ మంచి అభ్యర్ధులను ఎంపిక చేయగలిగితే రెండు రాష్ట్రాలు మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్ధుల ఖరారు కోసం వేర్వేరు సమావేశాలు నిర్వహించింది.
రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇవాళ ఆయా రాష్ట్రాల నేతలతో చర్చించారు. ఇందులో ఈ రెండు రాష్టాల్లో గెలుపు గుర్రాలపై చర్చించారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్ధితులపైనా నేతలు చర్చించారు. రాజస్తాన్ కు సంబంధించిన సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తెలంగాణ వెళ్లాల్సి ఉండటంతో మధ్యప్రదేశ్ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.

రాజస్తాన్ లో సుపరిపాలన కారణంగా మరోసారి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇవాళ భేటీలో వ్యాఖ్యానించారు. రాజస్తాన్ లో వచ్చే నెల 25న జరిగే ఎన్నికలకు అభ్యర్ధుల్ని ఖరారు చేసేందుకు సీఈసీతో ఆయన చర్చలు జరిపారు. ఈ భేటీలో సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్ దోతాస్రా, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ సుఖ్జీందర్ రణ్ థావా తో పాటు పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు అధిష్టానానికి తెలిపారు.
అనంతరం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన భేటీలోనూ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా, ఇతర నేతలు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లో ఈసారి కాంగ్రెస్ గెలుపుపై ఇప్పటికే పలు సర్వేలు వెలువడ్డ నేపథ్యంలో పరిస్ధితుల్ని పూర్తిగా తమకు అనుకూలంగా మల్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో నేతలకు అధిష్టానం కీలక దిశానిర్దేశం చేసింది.












Click it and Unblock the Notifications