లోక్‌సభకు కొత్త వ్యూహంతో కాంగ్రెస్...జైకిసాన్, జైనౌజవాన్ నినాదాలే కీలకం
భారతీయ జనతా పార్టీని డీల్ చేయాలంటే ఒక్క రైతు సమస్యలనే కార్నర్ చేస్తూ ముందుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమాలు చేస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో... 2019లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని భావిస్తోంది. ఇక ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ కొత్త నినాదాలతో ముందుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వంను ఓ వైపు టార్గెట్ చేస్తూనే మరో వైపు రైతు సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తోంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త నినాదాలు అందుకుంటోందని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జై కిసాన్, జైనౌజవాన్, న హిందూ, న ముస్లిం (రైతే రాజు, యువత వర్థిల్లాలి, హిందూ కాదు ముస్లిం కాదు) అనే నినాదాలకు హస్తం పార్టీ శ్రీకారం చుట్టనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రైతు మంత్రంతోనే విజయం సాధించిందని భావిస్తోంది. ఇదే మంత్రాను లోక్‌సభ ఎన్నికలకు కూడా ప్రయోగించాలనే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు ఈ మంత్రం ఉపకరిస్తుందని... రైతులు, యువత కాంగ్రెస్‌కు మద్దతు పలికితే కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొడుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే రుణమాఫీలపై బీజేపీ ఆచితూచి అడుగువేస్తోంది. ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. ఇది తప్పినించి తిరిగి బీజేపీకి అధికారంలోకి తీసుకొచ్చే పథకాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇతర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిరిగి ఢిల్లీకి రాజుకావాలని భావిస్తోంది కమలం పార్టీ. రైతులకు రుణమాఫీ ప్రకటించాలని బీజేపీ నాయకులు నాటి ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు సూచించారని.... కానీ దాన్ని ఆయన పెడచెవిన పెట్టడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారని బీజేపీ నాయకులే చెవులు కొరుక్కుంటుండటం విశేషం.