టీ బిల్లు: సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంపై చర్చించడానికి కాంగ్రెసు కోర్ కమిటీ అత్యవసరంగా మంగళవారం సాయంత్రం సమావేశమవుతోంది. రాజ్యసభలో తొలుత బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రయత్నానికి ఆటంకం ఏర్పడడంతో ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ బిల్లు ఆర్థిక వ్యవహారాలతో కూడిందా, లేదా అనే విషయంపై కోర్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల విషయంపై కూడా కోర్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు కాదని కేంద్ర మంత్రి పి. చిదంబరం గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతం పెడుతున్న బిల్లులో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన అంటున్నారు.

ఆర్థిక బిల్లు అవుతుందా, లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహాను కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ ముందుకు రావాల్సిన బిల్లు వెనక్కి వెళ్లింది. రేపు కూడా బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎల్లుండి గురువారం తొలుత లోకసభలో బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు కట్టడి చేయలేకపోవడంపై బిజెపి తీవ్ర విమర్శ చేస్తోంది. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని అంటూనే వివిధ షరతులు పెడుతోంది. దీంతో కాంగ్రెసు పార్టీ అయోమయంలో పడింది. ఈ రోజు బిల్లు రాజ్యసభకు రావడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications