మొన్న జయ, నేడు రజనీకాంత్‌కు చురకలు: ఖుష్బూ దూకుడు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆమె తనదైన శైలిలో దూసుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు డీఎంకేలో ఉన్న ఖుష్బూ ఎన్నికల ప్రచారం సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సవాళ్ల మీద సవాళ్ల విసిరారు.
ఆరు నెలల క్రితం డీఎంకేను విడిచిన ఖుష్బూ మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె చేరికతో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడుతుందని ఆ పార్టీ తమిళ వర్గాలు భావించారు. ఖుష్బూ చేరిక తమకు లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పిన విషయం తెలిసిందే.
అదే సమయంలో ఖుష్బూ తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఆమె ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే చురకలు వేశారు. రాజకీయాలు హిట్ సినిమాల్లో నటించినంత సులభం కాదని ఖుష్బూ శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శనివారం టీఎన్సీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

విలేకరులు రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం పైన ప్రశ్నించారు. దీనిపై ఖుష్బూ స్పందించారు. ఒక సినిమా ఫెయిలైనా మళ్లీ నిలదొక్కుకోవచ్చులే అనుకోవడానికి ఇవేమీ బ్లాక్ బస్టర్ సినిమాలు కావని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలన్నారు. లేకుంటే లేదన్నారు.
అంతేకానీ రాజకీయాల్లోకి ఓ రోజు వస్తామని, మరో రోజు రానని చెప్పి కుప్పిగంతులు ఎందుకని చురకలు అంటించారు. కష్టనష్టాలను భరించి అన్నింటిని ఎదుర్కొనగలిగే వారే రాజకీయాల్లోకి వచ్చి, మనగలరని చెప్పారు. ఆది నుండి తన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందన్నారు.
అయితే, కొన్ని కారణాల వల్ల తాను డీఎంకే పార్టీలో చేరానని, ఇందిర, రాజీవ్ గాంధీలు అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఇదిలా ఉండగా, రజనీ పైన ఖుష్బూ వ్యాఖ్యలు వ్యూహాత్మక దూకుడా లేక విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే సందర్భంలో అనుకోకుండా అలా మాట్లాడారా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications