‘కాంగ్రెస్ డిఎన్ఏలోనే తప్పుడుపనులు’: సోనియాకు కౌంటర్
ఛండీఘర్: హర్యానా మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. తప్పుడు పనులు చేయడం అనేది కాంగ్రెస్ నాయకులందరి డిఎన్ఏల్లోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘కాంగ్రెస్ నాయకులందరి డిఎన్ఏల్లోనే తప్పుడు పనులున్నాయి' అని అనిల్ విజ్ ట్విట్టర్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడబోనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోనియా వ్యాఖ్యలపైనా విజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘అందరికీ తెలుసు. కాంగ్రెస్ నాయకులు తప్పులు చేసేందుకు ఎవరికీ భయపడరు. కాంగ్రెస్ నాయకులందరిదీ అదే డిఎన్ఏ' అని హర్యానా ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా ఉన్న అనిల్ విజ్ మరో ట్వీట్ చేశారు. అంతేగాక, ఇందిరా గాంధీపైనా ఆయన విమర్శలు గుప్పించారు.

‘ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను ఇందిరాగాంధీ కాలరాశారు' అని ధ్వజమెత్తారు. ఆమె ఆత్మ ఇప్పటికీ కాంగ్రెస్ నేతల్లో జీవించే ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.
రాజకీయాలను వీడి రాబర్ట్ వాద్రాతో కలిసి ప్రాపర్టీ డీలింగ్ బిజినెస్ చేసుకోవాలని, ఆ బిజినెస్ వెంచర్‌కు ‘రాహుల్ అండ్ వాద్రా ప్రాపర్టీస్' అని నామాకరణం చేయాలని సూచిస్తూ మంత్రి విజ్ ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానిది ప్రతీకార రాజకీయాలన్న కాంగ్రెస్ నేతలపైనా మంత్రి అనిల్ మండిపడ్డారు.
గతంలో చాలా సార్లు నెహ్రూ-గాంధీ కుటుంబాలనై ఈ మంత్రి విమర్శలు గుప్పించారు. గత ఏప్రిల్‌లో రైలులో ప్రయాణించిన రాహుల్ ఫొటోను చూసిన ఆయన దానిపై స్పందిస్తూ.. ఇంటి నుంచి పారిపోయిన పిల్లాడిలా రాహుల్ భయపడిపోతూ ఉన్నారని వ్యాఖ్యానించారు. రాబర్ట్ వాద్రా కంపెనీ భూ ఒప్పందాలపైనా ఆయన చాలాసార్లు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications