జగన్‌ను కలుపుకెళ్దాం: కాంగ్రెస్ ముందు ప్రతిపాదన?: రేపు కీలక భేటీ
Congress Parliamentary Party General Body meeting: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై విపక్షాలు భగ్గుమంటోన్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే.. వాడివేడిగా విమర్శనాస్త్రాలను సంధిస్తోన్నారు.
సమాజ్‌వాది పార్టీ అధినేత, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది.. ఇలా దాదాపుగా ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా ఎంపీలు అధికార ఎన్డీఏపై ముప్పేటదాడి సాగిస్తోన్నారు.

ఇదే దాడి, ఒత్తిడిని మున్ముందు మరింత తీవ్రతరం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై చర్చించడానికి బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరుగనుంది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరొచ్చంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 24వ తేదీన దేశ రాజధానిలో నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెసేతర విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఈ ఆందోళనకు హాజరు కాలేదు. తన ప్రతినిధులుగా ఎవ్వరినీ పంపించలేదు.
ఇండియా కూటమిలో వైఎస్ జగన్ చేరాలంటూ డీఎంకేకు చెందిన ఎంపీ తిరుమావళన్ సహా మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గేకు సైతం వాళ్లు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై పార్లమెంటరీ పార్టీలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications