UPI ఛార్జెస్ రూ.5,000 లకు 25, రూ. 10,000 లకు 50: మండిపడ్డ కాంగ్రెస్
యూపీఐ, రూపే లావాదేవీలపై అదనపు ఛార్జీల విధింపు ప్రతిపాదన వ్యవహారం.. నూతన వివాదానికి తెరలేపింది. రూ. 2,000 లోపు చిన్న లావాదేవీలకు మాత్రమే ఉచిత సేవలను పరిమితం చేస్తూ, అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే పెద్ద వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. విదేశీ ఆర్థిక సంస్థల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందని ఆరోపించారు. అమెరికన్ పేమెంట్ కంపెనీల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే భారత్‌లో స్వచ్ఛందంగా అమలులో ఉన్న యూపీఐ విధానాన్ని నీరుగారుస్తోన్నారని విమర్శించారు. యూపీఐ చెల్లింపుల్లో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు అయిదు శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. మొత్తం లావాదేవీల విలువలో వాటి వాటా దాదాపు 65 శాతంగా ఉందని తెలిపారు.

ఈ నిర్ణయంతో వ్యాపారులపై భారం పడుతుందని, వాళ్లు ఈ భాారాన్ని ప్రజల నుంచే వసూలు చేస్తారని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశాన్ని తప్పుపట్టారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడిని ఇది దారుణంగా దెబ్బకొడుతుందని మండిపడ్డారు. హోల్ సేల్ ద్రవ్యోల్బణం దేశంలో ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరిందని, ఈ తరుణంలో డిజిటల్ పేమెంట్స్ టాక్స్ రూపంలో ప్రజధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.
వ్యాపారులపై విధించే అదనపు ఎండీఆర్ పరిణామాలు పరోక్షంగా కొనుగోలు వస్తువుల ధరల పెరుగుదలకు కారణమౌతాయని, దీని తాలూకు అంతిమ ప్రభావం ప్రత్యక్షంగా మధ్యతరగతి ప్రజలపైనే పడుతుందని ఖర్గే స్పష్టం చేశారు. యూపీఐపై ఎలాంటి ఫీజులను వసూలు చేయబోమని చెబుతోన్నకేంద్రం.. ఇప్పుడు రూ. 2,000 వరకు మాత్రమే యూపీఐ లావాదేవీలపై ఫీజులు లేవని చెబుతోందంటూ ధ్వజమెత్తారు.
ప్రజల వద్ద మిగిలి ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ ను లూటీ చేసే లక్ష్యంతో కేంద్రం ఈ డిజిటల్ చెల్లింపుల పన్ను విధించాలని యోచిస్తోందని ఖర్గే అన్నారు. పదేళ్ల కిందట పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద కుదుపునిచ్చిందని, దీని వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలపై ప్రశ్నలు తలెత్తినప్పుడు.. డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికే దీనిని విధించామని ప్రభుత్వం వాదించిందని గుర్తు చేశారు.
ఇప్పుడు అవే లావాదేవీలపై జనం డబ్బును గుంజుకుంటోందని ఖర్గే అన్నారు. రూ. 5,000 లావాదేవీపై రూ. 25, రూ. 10,000 లావాదేవీపై రూ. 50 వరకు వసూలు చేసే అవకాశం ఉందని అన్నారు. మార్కెట్ డిస్కౌంట్ రేట్ ద్వారా వ్యాపారులపై పడే ఈ అదనపు భారాన్ని చివరికి సామాన్య వినియోగదారుడి జేబు నుంచే వసూలు చేస్తారనే విషయం మోదీ ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు.














Click it and Unblock the Notifications
