మీకు దమ్ముంటే మే లోగాా ఈవీఎంలు హ్యాక్ చేయండి: మాయా-విపక్షాలకు ఈసీ సవాల్
గత కొద్ది రోజులుగా ఈవీఎంలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి షాక్. స్వయంగా కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈవీఎంలపై ఆరోపణలను కొట్టి పారేశారు.
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ఈవీఎంలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి షాక్. స్వయంగా కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈవీఎంలపై ఆరోపణలను కొట్టి పారేశారు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని మాయావతి పదేపదే విమర్శించారు. కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది.
ఈవీఎంల విశ్వసనీయతపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సక్రమంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను మాజీ న్యాయశాఖ మంత్రిని అని, తన హయాంలోనే ఈవీఎంలను ప్రవేశపెట్టారని, వాటిపై ఫిర్యాదులు వచ్చాయని, ఆ సమయంలో వాటిని సరి చూశామని చెప్పారు.

ఆ విషయాన్ని మరవవద్దని గుర్తు చేశారు. ఈవీఎంలు చాలా బాగా పని చేస్తాయని, యూపీఏ హయంలోను వాటిని పరిశీలించామని చెప్పారు. పార్టీల ఓటమికి ఈవీఎంలు ఎంతమాత్రం కారణంగా కాదన్నారు.
మీ ఓటమికి మీరే కారకులు అని చెప్పారు. కేవలం ఓడిపోయిన నేతలు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఝలక్ ఇచ్చారు. కాగా, మెయిలీ సొంత పార్టీ తీరుపై వ్యతిరేకత చూపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల కమిషన్ ఓపెన్ చాలెంజ్
ఈవీఎంల విశ్వసనీయతపై మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు ఎన్నికల సంఘం ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. మీరు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించాలని చెప్పింది. మీకు దమ్ముంటే హ్యాక్ చేయండని సవాల్ చేసింది. ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని చెప్పింది.
ఈవీఎంల టాంపరింగ్ చేయవచ్చంటూ పలువురు రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది. దమ్ముంటే ఈవీఎంల టాంపరింగ్ నిరూపించండని సవాల్ చేసింది.
టాంపరింగ్ నిరూపించాలని సైంటిస్టులు, నిపుణులు, రాజకీయ పార్టీల నేతలకు సవాల్ విసిరింది. ఇందుకోసం మే నెల వరకూ గడువు ఇచ్చింది. మే మొదటివారంలో నిరూపించాలని చెప్పింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలుత మాయావతి ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు మద్దతిచ్చారు.
తాను ఐఐటీ చదువుకున్నానని, 72 గంటల్లో ఈవీఎంల టాంపరింగ్ నిరూపిస్తానని కేజ్రీవాల్ గతంలో చెప్పారు. దాదాపు పదిహేను రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈవీఎంల టాంపరింగ్ జరుగుతున్నాయంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ తీవ్రంగా స్పందించింది. దమ్ముంటే ఈవీఎంల టాంపరింగ్ నిరూపించాలని సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications