సాయంత్రం 6:30 లోపు దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు బంద్.. సంచలన ఆదేశాలు జారీ
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దాంతో న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. గురువారం సాయంత్రం 6:30 లోపు దిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వాణిజ్య, వ్యాపారవేత్తల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సీజేపీ నిరసనల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు న్యూదిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్(NDTA) అధ్యక్షుడు అతుల్ భార్గవ కీలక అడ్వైజరీ జారీ చేశారు. అందులో.. కన్నాట్ ప్లేస్ లోని అన్ని కమర్షియల్ దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేయాలని ఎన్డీఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. " ఎన్డీఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సూచనల మేరకు కన్నాట్ ప్లేస్ లో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అన్ని షాప్ లు, ఇతర ఎస్టాబ్లిష్ మెంట్స్, ఆఫీస్ లు, రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు మూసివేయాలి" అని అడ్వైజరీ జారీ అయింది. సీజేపీ నిరసనల నేపథ్యంలో దుకాణాలు, కార్యాలయాల రక్షణ, భద్రత దృష్ట్యా వ్యాపారవేత్తలు ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
అయితే దిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ వివరాలను ఎక్స్ లో షేర్ చేశారు. భద్రత పరమైన చర్యలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. " కన్నాట్ ప్లేస్ లోని అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు మూసివేయాలని ఆదేశాలు వచ్చాయి. భద్రత కట్టుదిట్టం చేశారు. అంబులెన్స్ ను భారీగా మోహరించారు. కేంద్రం ఏం చేస్తోంది..? మోదీ ప్రభుత్వం మరోసారి సొంత బిడ్డలపైనే దాడులు చేస్తుందా..? అని ప్రశ్నించారు.

మరోవైపు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం ప్రధాని మోదీకి విన్నపం చేసింది. దిల్లీలో చాలా రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల కారణంగా తాము చాలా నష్టపోయామని స్పష్టం చేసింది. తమ వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. దిల్లీ శివారులో శాశ్వతంగా నిరసన ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. సీటీఐ సర్వే ప్రకారం గత మూడు రోజుల్లో దిల్లీలోని వ్యాపార కార్యకలాపాలు ఏకంగా 70 శాతానికి పడిపోయాయి.












Click it and Unblock the Notifications