• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?

By BBC News తెలుగు
|

కార్నేలియా సొరాబ్జీ

భారత్‌కు ఆమె తొలి మహిళా న్యాయవాది. మగవారి చేతుల్లో చిత్ర హింసలు అనుభవించిన, వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలిచారు. ప్రభుత్వ సాయం లేకుండానే, ఒంటరిగా, ప్రాణాలకు తెగించి చాలాసార్లు ఆమె మహిళల కోసం పోరాడారు.

ఆమెపై ఎన్నో దాడులు కూడా జరిగాయి. వాటి నుంచి తప్పించుకుంటూ తన లక్ష్యం కోసం ఆమె ఎంతో కృషిచేశారు.

భారత్, బ్రిటన్‌లోని న్యాయ రంగాల్లో మహిళలు అడుగుపెట్టేలా స్ఫూర్తినింపిన ధీర వనితగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.

ఆమె పేరు కార్నేలియా సొరాబ్జీ.

ఆమె గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకునేందుకు ఆమె మేనల్లుడు, చరిత్రకారడు సర్ రిచర్డ్ సొరాబ్జీతో బీబీసీ ప్రతినిధి క్లైర్ బోస్ మాట్లాడారు.

కార్నేలియా ఒంటరిగా పోరాటం చేస్తూ చాలా మంది మహిళల జీవితాలను ఎలా కాపాడారో రిచర్డ్ బీబీసీకి వివరించారు.

కార్నేలియా సొరాబ్జీ

అలా మొదలైంది...

మహారాష్ట్రలోని నాశిక్‌లో 1866 నంబరు 15న కార్నేలియా జన్మించారు. అప్పట్లో బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ పాలనలో ఉండేది. కార్నేలియా తల్లిదండ్రులు పార్సీలు. అయితే తర్వాత కాలంలో వారు క్రైస్తవంలోకి మతం మారారు.

బాల్యం నుంచీ చదువులో కార్నేలియా ముందుండేవారు. బొంబాయి యూనివర్సిటీలో అడుగుపెట్టిన తొలి మహిళా విద్యార్థిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు బ్రిటన్‌లో ఉన్నత చదువుల కోసం ఆమె స్కాలర్‌షిప్ కూడా పొందారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించిన తొలి మహిళా విద్యార్థిని కూడా ఆమెనే. చివరి పరీక్షల్లో పురుషులతో కలిసి ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అయితే ఆమె దీనిపై పోరాడారు.

పరీక్షకు కొన్ని గంటల ముందు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తమ నిబంధనల్లో మార్పులు చేసింది. పురుషులతో కలిసి పరీక్ష రాసేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది.

''నేను న్యాయ విద్యను అభ్యసించాలని అనుకున్నాను. నా కల తీరుతోంది’’అని ఆమె తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

''చూడటానికి ఆమె చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే, ఆమెకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువ’’అని రిచర్డ్ వివరించారు.

ఆక్స్‌ఫర్డ్‌లో న్యాయ విద్య పూర్తిచేసుకున్న అనంతరం ఆమె భారత్‌కు తిరిగి వచ్చేశారు. అయితే, అప్పట్లో న్యాయవాదిగా పనిచేసేందుకు భారత్‌లోగానీ, లేదా బ్రిటన్‌లోగానీ మహిళలకు ఎలాంటి హక్కులూ లేవు.

భారత్‌లో అప్పుడు చాలా సంస్థానాలు ఉండేవి. వాటిలోని రాజ కుటుంబాలను కార్నేలియా కలిసేవారు. ఈ కుటుంబాల్లోని మహిళలు.. చాలా అణచివేతకు గురయ్యేవారని, వారికి ఎలాంటి హక్కులూ ఉండేవికాదని ఆమె భావించేవారు.

అప్పట్లో చాలా సంస్థానాల్లో పరదా వ్యవస్థ కూడా అమలులో ఉండేది. తమ కుటుంబానికి వెలుపల పురుషులతో మహిళలను మాట్లాడనిచ్చేవారు కూడా కాదు.

రాజ కుటుంబాల్లోని మహిళలు తీవ్ర అణచివేతకు గురికావడంతోపాటు వారికి ఆస్తి హక్కులు కూడా లేకపోవడాన్ని కార్నేలియా గుర్తించారు.

చాలాసార్లు ఈ కుటుంబాల్లోని మహిళల్ని గళం ఎత్తినందుకు చంపేసేవారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బయటవారికి వీలుండేది కాదు. దీంతో ఇక్కడ జరిగే అరాచకాలు, అణచివేతలపై ఎవరికి ఫిర్యాదులు కూడా అందేవి కాదు.

ఇలాంటి మహిళలకు సాయం చేయాలని కార్నేలియా నిర్ణయం తీసుకున్నారు. హిందువులతోపాటు ముస్లింలలోనూ మహిళలపై జరిగే అరాచకాలను అడ్డుకునేందుకు తనను ప్రభుత్వ న్యాయ సలహాదారుగా నియమించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.

అయినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదు. తర్వాత 20ఏళ్లపాటు న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, కొన్నిసార్లు డిటెక్టివ్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో మహిళలకు ఆమె సేవ చేశారు. దాదాపు 600 మంది మహిళలకు అణచివేత నుంచి విముక్తి కల్పించారు.

తక్కెడలో భార్య, భర్త

చాలా మంది నుంచి విరోధం..

రాజ కుటుంబంలోని మహిళలకు స్నేహం ద్వారా ఆమె దగ్గరయ్యేవారు. నెమ్మదిగా వారి స్థితిగతుల గురించి తెలుసుకునేవారు. తర్వాత పోలీసులు, అధికారుల సాయంతో వారికి సాయం చేసేందుకు ప్రయత్నించేవారు.

''కొన్నిసార్లు నాకు ఏమీ తెలియనట్లు అనిపించేది. చాలాసార్లు పనులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేది. కానీ స్నేహితులు నిరంతరం నన్ను ప్రోత్సహించేవారు. చివరగా నాకు విజయం దక్కింది’’అని ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు.

''ఒకసారి అయితే, ఒక మహిళకు భరణం ఇచ్చేందుకు ఆమె అత్తింటివారు నిరాకరించారు. కార్నేలియా చాలా ప్రయత్నాల అనంతరం బాధిత మహిళను కలిసేందుకు అత్తింటివారు అంగీకరించారు. అంతేకాదు భరణం కూడా ఇస్తానని అన్నారు’’అని రిచర్డ్ చెప్పారు.

''బాధిత మహిళకు బహుమతిగా ఇచ్చేందుకు ఆ కుటుంబం ఒక డ్రెస్సు కూడా తెచ్చింది. అయితే, కార్నేలియా చాలా తెలివైనవారు. వెంటనే ఆ బట్టల్ని పరీక్షించారు. దీంతో వాటికి విషం పూశారని అర్థమైంది’’అని రిచర్డ్ తెలిపారు.

అలా బాధిత మహిళ ప్రాణాలను కార్నేలియా కాపాడారు. చాలాసార్లు కార్నేలియాపైనా దాడులు జరిగాయి. చాలా సంస్థానాలు ఆమెను శత్రువులా చూసేవి. మహిళలు.. పురుషుల హక్కని, తమ సంస్కృతి సంప్రదాయాలను కార్నేలియా మంట గలుపుతున్నారని సంస్థానాల అధిపతులు భావించేవారు.

ఒకసారి ఓ రాజ కుటుంబం ఆమెను అల్పాహారం తినడానికి రమ్మని ఆహ్వానించింది. అయితే ఆహారం నుంచి వస్తున్న వాసన తేడాగా ఉండటంతో ఆమె ఏమీతినలేదు. అసలు ఎవరూ ఏమీ తినలేదు. ఆ ఆహారానికి పరీక్షలు నిర్వహించగా.. దానిలో విషం కలిపినట్లు తేలింది.

కార్నేలియా సొరాబ్జీ

''నీకు ఇంగ్లిష్ తప్పా.. ఏమీ రాదు’’..

చాలా ఏళ్ల కృషి తర్వాత.. 1919లో మహిళలు కూడా న్యాయ రంగంలో పనిచేసేలా బ్రిటన్ మార్పులు తీసుకొచ్చింది. దీంతో మహిళలు కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు మార్గం సుగమమైంది.

బ్రిటన్ తీసుకొచ్చిన మార్పులతో.. కార్నేలియా అధికారికంగా న్యాయవాదిగా మారారు. అంతేకాదు భారత్‌లో తొలి మహిళా న్యాయవాది కూడా ఆమెనే.

''నేను ఎలాగైనా న్యాయవాదిని కావాలని అనుకున్నాను. అప్పుడే పురుషుల చేతుల్లో చిత్ర హింసలకు గురవుతున్న మహిళల్లో ఒక ఆశ చిగురింప జేసినట్లు అవుతుందని భావించాను’’అని కార్నేలియా ఒక లేఖలో రాశారు.

న్యాయవాదిగా మారిన తర్వాత కూడా ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో కొందరు జడ్జిలు మహిళా న్యాయవాదుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించేవారు. పురుషుల కేసులు వాదించే న్యాయవాదులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. మహిళా న్యాయవాదుల్ని పట్టించుకునేవారు కాదు.

''నీకు ఇంగ్లిష్ బాగా వచ్చు.. అంతే ఇంకేమీ రాదు’’అని ఓ న్యాయమూర్తి అన్న మాటలను నేను ఎప్పటికీ మరచిపోలేను అని ఓ లేఖలో కార్నేలియా గుర్తుచేసుకున్నారు.

''మహిళల హక్కుల కోసం కార్నేలియా శక్తిమంతమైన పోరాటం చేశారు. నేడు మహిళలు న్యాయవాదులుగా మారుతున్నారంటే.. దాని వెనుక ఆమె కృషి ఎంతో ఉంది’’అని బ్రిటన్‌లో తొలి మహిళా బారిస్టర్ హెలీనా నోర్మాంటన్ వ్యాఖ్యానించారు.

న్యాయవాద వృత్తి నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత కార్నేలియా లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె 1954లో 88 ఏళ్ల వయసులో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cornelia Sorabji,The first women advocate of India was poisoned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X