మమత బెనర్జీ- రైల్వే మంత్రి వాగ్వివాదం- ప్రమాద స్థలి వద్ద.. మీడియా ముందే
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 288కి చేరింది. 747 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

కాగా- ప్రమాద స్థలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ- రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వాగ్వివాదానికి దిగడం కలకలం రేపింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై వారిద్దరూ వాదులాడుకున్నారు. మమతా బెనర్జీ చెప్పిన మరణాల సంఖ్యను అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు.
మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మమతా బెనర్జీ- రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 500లకు పైగా ఉండొచ్చని అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని ఎవరు ఇచ్చారనేది చెప్పలేదు. కొద్దిసమయం వ్యవధిలో కోరమాండల్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యారని, ఇది మానవ తప్పిదమేనని ఆమె అన్నారు. ఈ ఘటనలో 500 మందికి పైగా మరణించి ఉండొచ్చని చెప్పారు.

ఆమె పక్కనే నిల్చుని ఉన్న అశ్విని వైష్ణవ్- దీన్ని తప్పుపట్టారు. మమత బెనర్జీ చెప్పిన మృతుల సంఖ్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతమంది మరణించలేదని తేల్చి చెప్పారు. అధికారికంగా మరణించిన ప్రయాణికులు 238గా నిర్ధారించామని పేర్కొన్నారు. దీనికి మమతా బెనర్జీ బదులిస్తూ- మూడు కోచ్‌లలో రెస్క్యూ పని ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తోన్నానని అన్నారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications