టీడీపీ రెడ్డిగారికి కేంద్రంలో కీలక పదవి..!?
ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2029 లక్ష్యంగా బీజేపీ కొత్త నిర్ణయాలతో అడుగులు వేస్తోంది. పార్లమెంట్ లో త్వరలో ప్రవేశ పెట్టే కీలక బిల్లులకు అవరోధం లేకుండా మోదించుకొనేందుకు సంఖ్యా బలం పెంచుకుంటోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తో పాటుగా పార్టీలో కీలక మార్పులకు ప్రధాని మోదీ సిద్దం అవుతోంది. ఈ సారి జరిగే మంత్రివర్గ భారీ ప్రక్షాళన.. కేంద్ర పదవుల్లో టీడీపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ పదవుల రేసులో టీడీపీ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. ఏపీ నుంచి మరో మంత్రి పదవి ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉండగా.. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కొనసాగుతున్నారు. ఈ సారి జనసేనకు ఛాన్స్ వస్తుందనే అంచనాలూ ఉన్నాయి. కాగా.. సామాజిక - ప్రాంతీయ లెక్కల ఆధారంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది డిసైడ్ చేయనున్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస వర్మ.. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు.. కోస్తా జిల్లాల నుంచి పెమ్మసాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో.. ఈ సారి సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవి ఖరారు కానుంది. అందలో భాగంగా రాయలసీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం ఇస్తారనే అంచనాలు మొదలయ్యాయి.

కేంద్రమంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తు..!
ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు.. రాజ్యసభ సభ్యుల్లో రాయలసీమకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో, ఈ సారి గ్రేటర్ రాయలసీమ పరిధిలోని నెల్లూరు జిల్లా నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే విధంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి కూటమి నుంచి కేంద్రంలో మంత్రి పదవి కేటాయిస్తే రాజకీయంగా రీజియన్ లో ప్రభావం చూపిస్తుందనే లెక్కలు కూటమిలో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో.. ఎస్సీ వర్గానికి గవర్నర్ పదవి.. రెడ్డి సామాజిక వర్గానికి కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారని పార్టీ నేతల సమాచారం. చివరి నిమిషంలో ఇవే సమీకరణాలు ఖరారు అయితే వేమిరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications