దేశానికి మళ్ళీ కరోనా భయం.. నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్!!
భారతదేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఐదు నెలల గరిష్టానికి కరోనా కేసులు చేరుకోవడం ప్రస్తుతం దేశానికి ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తుంది. శనివారం నాడు దేశంలో 1890 కరోనా తాజా కేసులు నమోదు అయ్యాయి. 210 రోజుల తర్వాత ఇదే అత్యధిక కేసులు అని చెప్పాలి.
గత వారం రోజులలో 78 శాతం కరోనా కేసులు పెరిగాయి. దేశంలో 29 కరోనా మరణాలు కూడా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో 2,208 అత్యధిక కేసులు కాగా, తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య మరో మారు దేశంలో కరోనా భయానికి కారణంగా మారాయి. ఒక సంవత్సరం పాటు శాంతించిన కరోనా మహమ్మారి సంవత్సరం ప్రశాంతత తర్వాత, ప్రజలంతా మళ్ళీ సాధారణ జీవనానికి అలవాటు పడిన సమయంలో మళ్ళీ తన పంజా విసురుతుంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తీరు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్-19 వార్డులను సిద్ధం చేయాల్సిన పరిస్థితికి కారణంగా మారింది.

ఇదిలా ఉంటే గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేడు అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలతో చర్చించనుంది. ఇప్పటికే కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు., కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు.
ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ లో కూడా కరోనా మహమ్మారి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. రంజాన్ పండుగ తో పాటు, ఇతరత్రా పండుగలు కూడా వస్తున్నవేళ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాను తక్కువగా అంచనా వేయొద్దని, జాగ్రత్తలు కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మోడీ సూచించారు.












Click it and Unblock the Notifications